వ్యవసాయ కూలీలకు ఫుల్ డిమాండ్

వ్యవసాయ కూలీలకు ఫుల్ డిమాండ్

కరోనా ఎఫెక్ట్ తో కొరత
వరినాట్ల కోసం అన్నదాతల ఎదురుచూపు
రూ.5 వేలకు ఎకరం గుత్త

జనగామ, వెలుగు: కోవిడ్ ఎఫెక్ట్ వ్యవసాయ రంగాన్నీ వదలడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరినాట్లు జోరందుకోగా.. కూలీలకు మస్తు డిమాండ్ వచ్చింది. అడిగినంత ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నా కూలీలు దొరకని పరిస్థితి. కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండడంతో పల్లెల్లోని కూలీలు ఆచితూచి పనులకు వెళ్తున్నారు. పైగా వరి నాట్లకు పరిమిత సంఖ్యలో మాత్రమే కూలీలు వస్తుంటారు. గతంలో దినసరి కూలీతో వరినాట్లు వేయగా.. ఇప్పుడు గుత్తాలకే వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వానాకాల సీజన్లో పత్తి, వరి, కంది తదితర పంటలన్ని కలిపి సుమారు 15,04,704 ఎకరాల విస్తీర్ణంలో సాగు కానున్నాయి.. ఇందులో వరి పంట 4,92,514 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనా. కాగా, ఇప్పటికే 50 శాతం నాట్లు పూర్తి కాగా.. ఈ నెలాఖరు వరకు దాదాపుగా ముగింపు దశకు రానున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు.

జోరుగా వరి నాట్లు ..
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. బోరుబావుల్లో ఊటలు ఎక్కువయ్యాయి. గతంలో గ్యాప్ ఇచ్చి పోసిన బోర్లు.. ఇప్పుడు కంటిన్యూగా పోస్తున్నాయి. బావుల్లోనూ నీళ్లు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. వరుణుడి కరుణతో రైతులు హ్యాపీగా ఉన్నారు. వానాకాల సీజన్ పై భారీ ఆశలు పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరిసాగుపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతిలో సన్న వడ్లను ఎక్కువగా పండించాలని ఆదేశించడంతో వ్యవపాయ శాఖ ఆఫీసర్లు అవగాహన కల్పించారు. దీంతో ఎక్కువగా సన్నవడ్ల విత్తనాలు తెచ్చి నార్లు పోసుకున్నారు. అవి నాటడానికి వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా వరినాట్లు జోరుగా చేపడుతున్నారు. ఈ నెలాఖరు వరకు దాదాపుగా నాట్లు పూర్తయ్యే చాన్స్ ఉందని వ్యవసాయశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు.

ఎకరానికి రూ.5 వేలు..
ఎకరం వరినాటు వేసేందుకు రూ.5వేలకు గుత్తా తీసుకుంటున్నారు. గతేడాది రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు తీసుకున్నారు. ఈ సీజన్ ఆరంభంలో రూ.4వేల నుంచి రూ.4,500 వరకు తీసుకున్నారు. కానీ ఇప్పుడు దానిని రూ.5 వేలకు పెంచేశారు. ట్రాక్టర్లు, ఆటోల్లో కూలీలు పలు గ్రామాలకు వెళ్లి నాట్లు వేసి వస్తున్నారు. ఈ ట్రావెలింగ్ చార్జీలను కూడా రైతులపైనే వేస్తున్నారు. ఇంత చెల్లించినా అనుకున్న సమయానికి వచ్చి నాట్లు వేస్తారా అంటే అదీ కుదరని పనిగానే మారింది. ముందుగా బయానా ఇచ్చి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పొలాలు దున్నించి రెడీగా పెట్టుకుని వేచి ఉంటున్నట్లు రైతులు చెబుతున్నారు. కూలీ లీడర్లకు బయానా ఇస్తే వారే మిగతా కూలీలను వెంట తెచ్చుకుని నాట్లు వేసి వెళ్తున్నారు. కొన్ని చోట్ల నారురెడీ చేసి పెట్టాలని మెళికలు కూడా పెడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

ఖర్చులు తడిసి మోపెడు..
కరోనా దెబ్బకు ఏ పని చేద్దామన్నా కూలి రేట్లు ఎక్కువగానే ఉంటున్నాయని రైతులు అంటున్నారు. వరి నాటు పడే సమయం వరకే ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఎకరా పొలం రెండు సార్లు దున్ని రొప్పేందుకు ట్రాక్టర్ కు రూ.5 వేలు, వరాలు చెక్కి సరి చేసేందుకు గుత్తా రూ.1,500, రెండు పిండిబస్తాలు(డీఏపీలేదా ఇతర) రూ.2,500, నాట్లు వేసే కూలీలకు రూ.5 వేలు, కూలీల ట్రాన్స్ పోర్టుకు మరో రూ.వెయ్యి అదనంగా ఖర్చవుతోంది. పెట్టుబడి తడిసి మోపెడు అవుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

For More News..

సీఎం ఇలాకాలో డబుల్‌ ఇచ్చంత్రం

ఐపీఎల్‌కు స్పాన్సర్‌ దొరికేనా?

క్లాసులే కాదు.. ఎగ్జామ్స్ కూడా ఆన్‌లైన్ లో పెడ్తున్న ప్రైవేట్ స్కూల్స్