హైదరాబాద్​లో  కూలర్లకు ఫుల్ డిమాండ్..  డైలీ 50 వేలకిపైగా సేల్

హైదరాబాద్​లో  కూలర్లకు ఫుల్ డిమాండ్..  డైలీ 50 వేలకిపైగా సేల్
  • చాలా చోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాపారులు
  • రూ.3500 నుంచి రూ.10 వేలకి పైగా ధరలు
  • ఒక్కోచోట డైలీ 60 నుంచి 100 వరకు సేల్
  • ఎండ తీవ్రత పెరగడంతో కూలర్ల వైపు ప్రజల మొగ్గు   
  • కూలర్లు, ఏసీల వినియోగంతో పెరిగిన కరెంట్ వినియోగం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో ఎండవేడిమి నుంచి రిలీఫ్ పొందేందుకు నగర ప్రజలు తమ బడ్జెట్ లో దొరికే కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల నగరంలో కూలర్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కూలర్ల మేళాలను సైతం నిర్వహిస్తున్నారు.

ఈ సమ్మర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూలర్ల విక్రయాలు జరుగుతున్నాయని  వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని కూలర్లని డిమాండ్ కి సరిపడా సప్లయ్ చేయలేకపోతున్నామని చెప్పారు.  సిటీలో నెలరోజులుగా  ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇండ్లల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోత నుంచి ఉపశమనం కలగకపోవడంతో జనం కూలర్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నగరంలోని  ఓపెన్ ప్లేస్ లు, ఫంక్షన్ హాల్స్ తదితర ప్రాంతాల్లో  కొందరు వ్యాపారులు కూలర్ల మేళాను నిర్వహిస్తున్నారు. ఇక్కడ అందరికి అందుబాటులో ధరల్లో కూలర్లు ఉంటున్నాయి. రూ.3500 నుంచి మొదలుపెడితే రూ.10 వేలకి పైగా  కూలర్ల ధరలు ఉన్నాయి. అయినా స్టాక్ లేకపోవడంతో కొన్ని కూలర్ల మేళాలు ఇప్పటికే మూతపడ్డాయి.

డైలీ 50 వేలకిపైగా సేల్

గ్రేటర్ సిటీలో  డైలీ 50వేలకి పైగా కూలర్ల విక్రయాలు జరుగుతునట్లు వ్యాపారులు చెబుతున్నారు.  కూలర్ మేళాల్లో ప్రస్తుతం ఒక్కోచోట డైలీ 60 నుంచి 100 వరకు కూలర్లు అమ్ముడవుతున్నాయని తెలిపారు. హోల్ సేల్ షాపుల్లోనూ ఒక్కోదాంట్లో రెండు నుంచి మూడు వందల వరకు అమ్ముతుండగా..షాపింగ్  మాల్స్​, నార్మల్ షాపుల్లో డైలీ వేలల్లో బుకింగ్స్ అవుతున్నాయి. కొన్ని రకాల కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ చేసిన వారానికి కూలర్ డెలివరీ చేస్తున్నాయి. ఇలా గ్రేటర్ లో అన్ని రకాల కూలర్లు కలిపి డైలీ 50వేలకి పైగా విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ సమ్మర్‌‌ లో ఉన్నంత సేల్స్..గత ఏడేండ్లుగా ఎప్పుడూ లేదని నిర్వహకులు పేర్కొన్నారు. 

ఏసీలకూ పెరిగిన డిమాండ్


సిటీలో  కూలర్ల తరహాలోనే ఏసీలకూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొన్నటి వరకు రోజుకు 10 వేలకుపైనే ఏసీలు అమ్ముడైనట్లు అంచనా.  సమ్మర్ ప్రారంభం నుంచి ఇప్పటికే గ్రేటర్లో రెండు లక్షలకు పైగా ఏసీలు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇప్పటికీ సేల్స్ కొనసాగుతున్నాయి.  డిమాండ్ ఉండటంతో డెలివరీలకు 4,5 రోజుల టైమ్​పడుతున్నది. ప్రజలు ఎక్కువగా 5 స్టార్ ​రేటింగ్​ఏసీలు, 1.5 టన్స్​కొంటున్నారు. విద్యుత్ వాడకం తగ్గుతుందని ఎక్కువగా ఇన్వర్టర్​ టెక్నాలజీ ఏసీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇవి బేసిక్​గా రూ.33 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ధర ఎక్కువగా ఉన్నా వీటిని కొనేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది.  

భారీగా కరెంట్ వినియోగం

 ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విపరీతంగా వాడుతుండటంతో  గ్రేటర్ లో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. గతేడాది ఒక్క హైదరాబాద్​ పరిధిలో గరిష్టంగా 25 మిలియన్​ యూనిట్ల వినియోగం కాగా..ఈసారి 30 మిలియన్​యూనిట్లు మించిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇది ముందు ముందు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని మూడు జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్​, రంగారెడ్డి పరిధిలో ట్రాన్స్​ఫార్మర్లపై లోడ్ అధికంగా పడకుండా  200  అదనపు ట్రాన్స్ ఫార్మర్లను కూడా  ఏర్పాటు చేసినట్టు విద్యుత్ ఆఫీసర్లు వెల్లడించారు.

ఎండలను తట్టుకోలేక..

ఈ సారి ఎండలను తట్టుకోలేకపోతున్నం. ఇంట్లో ఫ్యాన్లు వేసినా ప్రయోజనం ఉండటంలేదు. అందుకే కూలర్ కొందామని కూలర్ మేళాకి వచ్చిన. ఇక్కడ కూడా అన్ని రకాల కూలర్లు అందుబాటులోలేవు. స్టాక్ లేదని చెబుతున్నారు. ఉన్న దాంట్లో రూ.6వేలు పెట్టి ఒకటి కొన్న. 
–అరుంధతి,  బోడుప్పల్

ఈ ఏడాది ఫుల్ డిమాండ్

ఎన్నడూ లేనంతగా కూలర్లకు ఈ సారి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.  కస్టమర్లకు రీక్వర్మెంట్ కి తగినంతగా మ్యానిప్యాక్చర్ కావడం లేదు. యూనిట్ వాళ్లు మాకు కావాల్సినన్ని  కూలర్లు అందించలేకపోతున్నారు. మే నెలలో కూడా ఎండలు ఎక్కువగా ఉంటే ఇదే డిమాండ్ ఉంటది. 
–బాబ్జి, కూలర్ల వ్యాపారి, ఎల్బీ నగర్