ఈసారి మాస్క్ లు, ఫేస్ షీల్డ్స్ కు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార సామగ్రి తయారీదారులు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికలు ఉండటంతో క్యాండిడేట్లకు ప్రచార సామగ్రిని అందించేందుకు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే పార్టీల అభ్యర్ధులు ఖరారు కావడంతో ఆర్డర్లు భారీగా పెరిగాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర చిన్నపార్టీలు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వటంతో, ఇన్ టైమ్ లో ప్రచార సామగ్రిని అందించేందుకు తయారీదారులు ఎక్కువమంది కార్మికులతో పని చేయిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలపై ముందే సమాచారం ఉండటంతో ప్రచార సామగ్రిని సమకూర్చుకోవడంలో టీఆర్ఎస్ దూసుకువెళుతోంది. ఇక అధికార పార్టీతో సమానంగా బీజేపీ కూడా పెద్దఎత్తున సామగ్రిని సమకూర్చుకుంటోంది. కాంగ్రెస్ సైతం ప్రచారానికి సై అంటూ ఎన్నికల సామగ్రి చేయిస్తోంది.
ముందే రెడీ చేసుకున్రు
గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చని కొంతకాలంగా వార్తలు వినిపిస్తుండటంతో తయారీదారులు ముందే ప్రచార సామగ్రిని సిద్ధం చేశారు. పార్టీ గుర్తులు, పార్టీల అధినేతలతో బ్యానర్లు, టోపీలు, టీషర్టులు, చిన్న, మధ్య, పెద్ద సైజు జెండాలు, ప్లకార్డులు, కీ చైన్లు , పెన్నులు, బ్యాడ్జీలు, డిజిటల్ ఫ్లాగ్స్ ఇలా అన్నింటినీ రెడీ చేసి ఉంచుకున్నారు. టోపీలను తయారు చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బీహార్ కు చెందిన వర్కర్స్ బిజీ బిజీ అయ్యారు. కరోనా గైడ్ లైన్స్ ప్రకారం మాస్కులు ధరించడం తప్పనిసరైంది. దీంతో కార్యకర్తలతోపాటు ప్రచారంలో పాల్గొనే వేలాది మందికి మాస్క్ లు, ఫేస్ షీల్డ్ లు ఇచ్చేందుకు క్యాండిడేట్స్ వాటిని రెడీ చేయిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఫొటోలతో పెద్ద ఎత్తున మాస్కులు, ఫేస్ షీల్డ్ లకు ఆర్డర్లు ఇచ్చారు. పలు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కూడా వీటి కోసం ఆర్డర్లు ఇచ్చాయి. వీటి ధరలు కూడా రూ.25, రూ.50 నుంచి ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు.
సోషల్ మీడియాతో లాస్
గ్రేటర్ ఎన్నికల ప్రచారంపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, దీంతో తమకు నష్టం జరుగుతోందని ప్రచార సామగ్రి తయారీదారులు వాపోతున్నారు. అభ్యర్థులు, వాళ్ల బంధువులు, అనుచరులు, కార్యకర్తలు పెద్దఎత్తున గ్రూప్ లు క్రియేట్ చేసి ఫేస్ బుక్, వాట్సప్ ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారని, ఆన్ లైన్ లోనే లైవ్ పెట్టే చాన్స్ లు ఉన్నందున తమకు ఆర్డర్లు తగ్గుతున్నాయని చెప్పారు. ఖర్చుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిఘా పెరగడం వల్ల కొందరు అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారని, ఖర్చు తగ్గించేందుకు ప్రచార సామగ్రి కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారని అన్నారు. ప్రచార సామగ్రికి తాము ఫిక్స్ చేసిన రేట్లు, ఎస్ఈసీ నిర్ధారించిన రేట్లకు చాలా తేడా ఉందని తయారీదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని , ఏ ఎన్నికలు జరిగినా ఇదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులకు రోజుకు రూ. 500
ఎన్నికల సామగ్రి తయారీదారులు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సాధారణంగా రోజుకు300 ఇస్తుండగా ఇప్పుడు500 వరకు చెల్లిస్తున్నారు. కరోనా వల్ల ఖాళీగా ఉన్న తమకు గ్రేటర్ ఎన్నికలతో ఉపాధి దొరికిందని కార్మికులు అంటున్నారు.
ప్రచార సామగ్రి ధరలు
చిన్న జెండా రూ. 3.50 నుంచి రూ.5
పెద్ద జెండా రూ.13 నుంచి రూ.20
టోపి రూ.6 నుంచి రూ.15
సాధారణ కండువా రూ.3.50 నుంచి రూ.5
వీఐపీ కండువా రూ.60 నుంచి రూ.70
టీ షర్ట్ రౌండ్ నెక్ రూ. 100 నుంచి రూ.130
టీ షర్ట్ కాలర్ ఉన్నది రూ.160 నుంచి రూ.180
మాస్క్ రూ.25
ఫేస్ షీల్డ్ రూ. 50
డిజిటల్ ఫ్లాగ్ రూ.200 నుంచి రూ.500
For More News..