మార్కెట్కు చవితి కళ.. బంతి, చామంతి పూలకు మస్త్ గిరాకీ

మార్కెట్కు చవితి కళ.. బంతి, చామంతి పూలకు మస్త్  గిరాకీ

హైదరాబాద్, వెలుగు: గుడి మల్కాపూర్ మార్కెట్ కి చవితి కళ వచ్చింది. సిటీతోపాటు శివారు ప్రాంతాలు, ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కొనుగోలుదారులు తరలి వస్తున్నారు. బంతి, చామంతి, గులాబీ వంటి పూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. . రోజూల గుడిమల్కాపూర్కు 10 నుంచి 12 టన్నుల దాకా బంతిపూలు వస్తుండగా ఈ రెండు రోజుల్లో సుమారు 25 టన్నులు వచ్చినట్టు వ్యాపారులు తెలిపారు. రెగ్యులర్ గా చామంతి పూలు 2 నుంచి 3 టన్నుల వరకు వచ్చేవని, ఈ మూడు రోజుల్లో దాదాపు7 టన్నుల దాకా అమ్మినట్టు తెలిపారు. 

అనంతపురం, చిలమత్తూరు, బాగేపల్లి, కర్నా టకలోని చిక్ బళ్లాపూర్, బెంగళూరుతోపాటు తమిళనాడు రాష్ట్రం నుంచి పూలు ఎక్కువగా దిగుమతి అవుతాయి. మహారాష్ట్రలోని హింగోళీ, నాందేడ్ నుంచి కూడా నిత్యం తెప్పిస్తారు. రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతులు ఎక్కువగా పూల సాగు చేస్తున్నారు.
 శంకర్ పల్లి. సర్వగూడ, వికారాబాద్, చేవెళ్ల, కందాడ, వరిగుట్ట తదితర ప్రాంతాల నుంచి బంతి, చామంతి, గులాబీలు గుడిమల్కాపూర్ కి వస్తాయి. మేలి రకం బంతిపూలు కిలోకి రూ.100, రెండో రకం రూ.80 నుంచి రూ. 60 దాకా అమ్ముతున్నారు. చామంతి కేజీ రూ.250 వరకు  విక్రయిస్తున్నారు. 

Also Read :- పూజకు కావాల్సిన సామాగ్రి ఇవే 

వినాయక చవితి సందర్భంగా పూల వినియోగం ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు రేటు పెంచి అమ్ముతున్నట్టు తెలుస్తోంది. వినాయక మండపాలను అలంకరణ, ఇతర అవసరాలకు ఎక్కువగా బంతి, చామంతి పూలు వాడుతారు. దీంతో ఈ రెండు రకాల పూలకే ఎక్కువ గిరాకీ ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా కొనుగోలుదారులు వస్తున్నట్టు తెలిపారు. జిల్లాల నుంచి వచ్చే వారు శుక్ర, శని వారాల్లో స్థానికులు, శివారు ప్రాంతాల వారు ఆదివారం మార్కెట్ కి వచ్చి పూలు కొనుగోలు చేసినట్టు వ్యాపారులు తెలిపారు.

అమ్మకాలకు ఇదే సీజన్

ఈ సీజన్లో బంతిపూలకు గిరాకీ ఉంటుంది. మహారాష్ట్రలోని హింగోళి నుంచి పూలు తెప్పిస్తాం. అక్కడి పూలు మంచిగ ఉంటాయి. మార్కెట్లో డిమాండ్ ని బట్టి రేట్ నిర్ణయిస్తాం. ఏటా వినాయక చవితి సీజన్లో వ్యాపారం బాగుంటుంది. శని, ఆదివారాల్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి. 
సతీష్, వ్యాపారి