- సంప్రదాయ కోర్సుల జోలికి వెళ్లని స్టూడెంట్లు
- కంప్యూటర్ సైన్స్, ఐటీకే ఫుల్ డిమాండ్
- ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్లో ఈ సీట్లే 95.56% భర్తీ
- మెకానికల్, సివిల్ కోర్సుల్లో సగం కూడా నిండని సీట్లు
హైదరాబాద్, వెలుగు: ఇంజనీరింగ్ విద్యలో జాబ్ రిలేటెడ్ కోర్సులకే ఫుల్ డిమాండ్ నడుస్తోంది. ఇటీవల ఎంసెట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తవగా.. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 95 శాతానికిపైగా సీట్లు నిండాయి. సంప్రదాయ కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్లు ఆసక్తి చూపలేదు. ఒకప్పుడు వెలుగు వెలిగిన మెకానికల్, సివిల్ తదితర కోర్ కోర్సులు.. ఇప్పుడు అడ్మిషన్లు లేక వెలవెలపోతున్నాయి. రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలుండగా, వాటిలో 74,071 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో పెట్టారు. వీటిలో ప్రైవేటు కాలేజీలు 158 ఉండగా, ఇందులో 68,512 సీట్లున్నాయి. మొత్తం 46 ఇంజనీరింగ్ కోర్సుల్లో 74,071 సీట్లకు గానూ 60,941(82.27%) సీట్లు ఫస్ట్ ఫేస్ కౌన్సెలింగ్లో భర్తీ అయ్యాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ రిలేటెడ్లో 95.56 శాతం సీట్లు నిండాయి. సంప్రదాయ కోర్సులైన సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి దాదాపు12 కోర్ కోర్సుల్లో 49.27% సీట్లే నిండాయి.
మార్కెట్లో డిమాండ్ ఉండటంతో..!
ఇంజనీరింగ్లో ఏ కోర్సులో జాయిన్ అయినా, చివరికి కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్ ఉద్యోగాల్లోనే చేరుతున్నారు. దీంతో క్రమంగా ఆయా కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. వాస్తవంగా ఈ కోర్సులకు ఇంజనీరింగ్ సెక్టార్కు సంబంధమే లేదని ప్రొఫెసర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 38,796 సీట్లుండగా.. 37,073(95.56%) సీట్లు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్లో భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్లు మొగ్గుచూపారు. ప్రస్తుతం ఆయా కోర్సులకే మార్కెట్లో డిమాండ్ ఉండటం దీనికి కారణం. ఈ ఏడాది కొత్తగా 2 వేలకు పైగా సీట్లు పెరిగితే.. అవన్నీ ఈ కోర్సుల్లోనివే. మేనేజ్మెంట్ కోటాలోనూ ఈ కోర్సుల్లో చేరేందుకే స్టూడెంట్లు ఇష్టపడుతున్నారు.
కోర్ కోర్సులను ఎత్తేస్తున్న కాలేజీలు
సివిల్, మెకానికల్, ఎరోనాటికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తదితర కోర్ కోర్సుల సీట్లకు ఏటా డిమాండ్ తగ్గుతోంది. ఈ కేటగిరీలో 12 కోర్సులుండగా ఈ ఏడాది కేవలం 12,764 సీట్లే అందుబాటులోకి వచ్చాయి. వీటిలోనూ 6,289 సీట్లు మాత్రమే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్లో భర్తీ అయ్యాయి. సివిల్లో 6,221 సీట్లుంటే 3,177 సీట్లు నిండగా.. మెకానికల్ ఇంజనీరింగ్లో 5,881 సీట్లుంటే 2,550 సీట్లు మాత్రమే నిండాయి. ఇప్పటికే చాలా కాలేజీలు ఇలాంటి సంప్రదాయ కోర్సులను ఎత్తేశాయి. మరిన్ని కాలేజీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. కోర్ కోర్సుల స్థానంలో కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర కోర్సులను పెంచుకుంటున్నాయి. దీంతో ప్రతి కాలేజీలో తప్పకుండా ఒక్క సంప్రదాయ కోర్సు ఉండాలని జేఎన్టీయూ నిబంధన పెట్టింది. కోర్ కోర్సులకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ప్రైవేటు కాలేజీలు ఈ కోర్సుల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ కోటా ఫీజుకే ఇచ్చేస్తున్నాయి. అయినా స్టూడెంట్లు చేరడం లేదని మేనేజ్మెంట్లు చెప్తున్నాయి.
అంతరాలను తగ్గించేందుకు ఆలోచిస్తున్నం
కొంతకాలంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఐటీ సెక్టార్లో చేరితే ఇంటిదగ్గర నుంచే జాబ్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయా కోర్సులు చదివేందుకు స్టూడెంట్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కోర్ కోర్సులు ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అవసరం. ఏ కాలేజీలోనూ ఆయా కోర్సులను పూర్తిగా మూసేయకుండా చర్యలు తీసుకున్నం. అంతరాలను తగ్గించేందుకు ఆలోచన చేస్తున్నం. - మంజూర్ హుస్సేన్, జేఎన్టీయూ రిజిస్ట్రార్