
- 5 లక్షల యూనిట్లకు16 లక్షలకు పైనే అప్లికేషన్లు
- స్కీంకు ఎంపిక చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు
- క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు.. యూనిట్ల పెంపు కోసం విన్నపాలు
- డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కనివాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం!
- మూడేండ్లపాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు ఫుల్ డిమాండ్ నెలకొంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ సారి 5 లక్షల యూనిట్లే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. మూడింతలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చూస్తున్నప్పటికీ ఫైనల్ చేయడం మంత్రులు, ఎమ్మెల్యేల చేతిలో ఉండటంతో అర్హులంతా వారి ఇంటి ముందు, క్యాంప్ ఆఫీసుల వద్ద క్యూ కడ్తున్నారు. యూనిట్లను పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడ కలిసినా వినతిపత్రాలు అందజేస్తున్నారు. స్కీమ్‌కు తమను ఎంపిక చేయాలని కోరుతున్నారు. గత కొన్నేండ్లుగా సబ్సిడీ పథకాలు అందుబాటులో లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారంలోకి రావడంతో ఈ పథకానికి ఇటు పార్టీ కేడర్ నుంచి కూడా డిమాండ్ ఉంది. యువ వికాసం కింద రూ. 6 వేల కోట్లు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో.. మరో రూ.1,600 కోట్లు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో ఇవ్వనున్నారు.
ఎక్కడికి వెళ్లినా అవే రిక్వెస్టులు
ఏ ఊరికి వెళ్లినా, ఏ కార్యక్రమానికి హాజరైనా ఎమ్మెల్యేలను ‘‘రాజీవ్ యువ వికాసం ఇప్పించండి’’ అంటూ యువత, కార్యకర్తలు కలుస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల అందరికీ స్కీమును అమలు చేస్తుండటంతో వారందరి నుంచి అన్ని గ్రామాల్లోనూ ఈ ఒత్తిడి కనిపిస్తున్నది. ‘‘మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కష్టపడ్డాం. రాజీవ్ యువ వికాసంలో మాకు మొదట అవకాశం ఇవ్వండి” అంటూ ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉండే చిన్నపాటి లీడర్లు, కార్యకర్తలు అడుగుతున్నారు. గ్రామ, మండల స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు కూడా తమ వర్గాల వారి కోసం సిఫారసు లేఖలతో ఎమ్మెల్యేల ఆఫీసులకు వెళ్తున్నారు. ఎవరైనా అప్లికేషన్ తీసుకొస్తే చాలు.. ‘‘రాజీవ్ యువ వికాసం కోసమా?’’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు ముందే అడుగుతున్నారంటే ఏ స్థాయిలో రిక్వెస్ట్‌లు వస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు. “ఇటీవలికాలంలో ఎవరు వచ్చినా యువవికాసం గురించే వస్తున్నారు. అప్లికేషన్లు పెట్టుకున్నామని.. తమకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అడుగుతున్నారు” అని ఓ ఎమ్మెల్యే అన్నారు. “ఇన్ని దరఖాస్తులు వస్తాయని ఊహించలేదు. ఎవరికి ఇవ్వాలి, ఎవరిని కాదనాలో అర్థం కావడం లేదు” అంటూ ఓ మంత్రి పేర్కొన్నారు.
మూడేండ్లు కొనసాగించాలి
అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు దాదాపు 5లక్షల యూనిట్లను రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ పోయింది. ఈ నెల 14తో ఆ గడువు ముగిసింది. ఈ ఒక్కసారే పథకాన్ని అమలు చేస్తారేమోనని భావించి భారీ సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. స్కీమ్ మొదటి జాబితాలోనే తమ పేరు ఉండేలా చూడాలని ఎమ్మెల్యేలపై నిరుద్యోగులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో వీలైతే యూనిట్లను పెంచాలని, మూడేండ్లపాటూ స్కీమ్‌ను కొనసాగించాలని సీఎంను మంత్రులు, ఎమ్మెల్యేలు కోరుతున్నారు.
ఇదీ దరఖాస్తుల పరిస్థితి
రాజీవ్ యువ వికాసం పథకంలో ఎక్కువ మంది రూ. 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారు. ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్ఠంగా రూ. 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46 శాతం ఈ కేటగిరీవే ఉన్నాయి. ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన రూ.50 వేల రుణాలకు కేవలం 39 వేల దరఖాస్తులు వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారాలకు ఈ 50 వేల రుణాలు ఉపయోగపడ తాయని ప్రభుత్వం భావించినా.. యువత వీటిపట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. రూ.50 వేల నుంచి 1 లక్షలోపు రుణాలకు (90% సబ్సిడీ) 93 వేల మంది అప్లయ్ చేసుకున్నారు. కార్పొరేషన్ల వారీగా చూస్తే బీసీ కింద 8.01 లక్షలు, ఎస్సీ కింద 3.92 లక్షలు, మైనార్టీ కింద 2.04 లక్షలు, ఎస్టీ కింద 1.83 లక్షలు, ఈడబ్ల్యూఎస్‌కింద 37 వేలు, క్రిస్టియన్ కింద 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈసారి రానివాళ్లకు వచ్చేసారికి!
అర్హుల్లో ఈసారి మిగిలిపోతున్న వారికివచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పుడు 16 లక్షలపైనే అప్లికేషన్లు వచ్చాయి. ఈసారితో కలిపి వచ్చే ఏడాదికి ఇంకో5 లక్షల యూనిట్లు ఇస్తే మొత్తం 10 లక్షల మందికి అందుతుంది. అయినా ఇంకో
6 లక్షల మంది మిగిలిపోతారు. పైగా కొత్తగా అప్లయ్ చేసుకునేవాళ్లూ ఉంటారు. మూడేండ్లపాటు ఈ స్వయం ఉపాధి సబ్సిడీ స్కీమ్‌ను కొనసాగిస్తే ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రజాప్రతినిధులు అంటున్నారు.