ఈ నెల 31 దాకా లాక్‌డౌన్
రాష్ట్రంలో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప అన్నీ బంద్
అందరూ ఇండ్లకే పరిమితం కావాలి
రేషన్ కార్డున్న ఫ్యామిలీలో ఒక్కొక్కరికీ ఫ్రీగా 12 కిలోల బియ్యం, కార్డుకు రూ. 1,500 ఇస్తం: సీఎం
పాలు, కూరగాయలు, కిరాణా షాపులు, గ్యాస్, పెట్రోల్ బంక్‌లు తెరిచే ఉంటయ్
బస్సులు, రైళ్లు, ఆటోలు, వైన్స్‌లు కూడా బంద్
ఇంటర్ స్టేట్ బోర్డర్లు మూసేస్తున్నం
ఐదుగురికి మించి బయట గుమిగూడొద్దు
ప్రభుత్వ ఉద్యోగులకు రొటేషన్ పద్ధతిలో డ్యూటీ
ప్రైవేట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు జీతాలివ్వాల్సిందే: కేసీఆర్
మన కోసం మనం, జనం కోసం జనం, అందరి కోసం అందరం పరితపించి పనిచేయాల్సిన సిచ్చువేషన్ ఇది. జనతాకర్ఫ్యూలో చూపిన క్రమశిక్షణ, పట్టుదల కొనసాగించాలి. మార్చి 31 దాకా రాష్ట్రం లాక్డౌన్లో ఉంటది. ప్రజలు గుమిగూడొద్దన్నదే దీని ఉద్దేశం. కరోనా వైరస్‌తో భయంకరంగా దెబ్బతింటున్న దేశం ఇటలీ. అక్కడ పరిస్థితిని అక్కడివాళ్లే చెడగొట్టుకున్నరు. ఇటలీలో రోజుకు ఐదారు వందల మంది చనిపోతున్నరు. ఆ దుర్గతి మనకు రావొద్దంటే వందకు వంద శాతం స్వయం నియంత్రణ పాటించాలి.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నెల 31 వరకు రాష్ట్రం లాక్డౌన్లో ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటివరకు ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప అన్నిటినీ బంద్ చేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, తాను ఇచ్చిన పిలుపునందుకొని ఆదివారం జనతా కర్ఫ్యూను రాష్ట్ర ప్రజలు అద్భుతంగా నిర్వహించారని, ఇదే స్ఫూర్తిని మరో తొమ్మిదిరోజుల పాటు కొనసాగించి ఎవరి ఇండ్లకు వాళ్లు పరిమితం కావాలని సూచించారు. కరోనా నుంచి రక్షించుకోవాలంటే స్వీయ నియంత్రణే ముఖ్యమని, అదే శ్రీరామ రక్ష అని ఆయన తెలిపారు. ఐదుగురికి మించి జనం గుమిగూడొద్దని, సీరియస్‌గా దీన్ని ఫాలో కావాలన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం ప్రగతిభవన్‌లో హైలెవల్ కమిటీతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
ఈ స్ఫూర్తి కొనసాగాలి
‘‘కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టిముట్టి భయకంపితం చేస్తున్నది. ప్రధానమంత్రి పిలుపుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంగా మనం దీన్ని రూపుమాపేందుకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చినం. అందరం కలిసి అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించినం. ప్రజలు ఆ పిలుపును గౌరవించి బయటికి రాకుండా ఇండ్లకే పరిమితమైండ్రు. ప్రపంచ మానవాళి కోసం ఎంతో కంట్రిబ్యూట్ చేసినం. సాయంత్రం ఐదుగంటలకు సంఘీభావ సంకేతంగా ఎవరి ఇండ్లల్లోంచి వాళ్లు చప్పట్లు కొట్టి థ్యాంక్స్ చెప్పారు. ఐక్యతను, విజ్ఞతను చాటిచెప్పిన ప్రతి తెలంగాణ బిడ్డకు, నా తరఫున, ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి నమస్కారాలు చెప్తున్న.” అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
తాజాగా ఐదు పాజిటివ్ కేసులు
ఆదివారం రాష్ట్రంలో ఐదు కరోనా పాజిటివ్‌కేసులు నమోదైనట్లు సీఎం తెలిపారు. ఈ ఐదుగురు కూడా విదేశాల నుంచి వచ్చినవాళ్లేనని, ఇందులో ఇద్దరు లండన్ నుంచి, ఇద్దరు దుబాయ్నుంచి, ఒకరు స్కాట్లాండ్ నుంచి వచ్చినవాళ్లని వివరించారు. ‘‘దేశానికి బయటి నుంచి వస్తున్న వ్యక్తులు బంద్ అవుతున్నారు.. ఫారిన్ నుంచి దిగుమతి అయ్యే బీమారీ అవస్థ ఈ రోజు నుంచి బంద్ అయితది.. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో, పాజిటివ్ వచ్చిన వారంతా ట్రీట్‌మెంట్లో ఉన్నరు. దుబాయ్ రిటర్నీ నుంచి పేరెంట్స్ ద్వారా వాళ్ల కొడుక్కు పాజిటివ్ వచ్చింది. లోకల్‌గా ఈ ఒక్కరికే వ్యాధి సంక్రమించింది. ఫారిన్ నుంచి వచ్చే వారి సంఖ్య అరెస్ట్ అయింది. కాబట్టి ఇక్కడ స్ప్రెడ్ కాకుండా అరెస్ట్ చేసే బాధ్యత మనమీద ఉంటది. అందరి కోసం అందరం పరితపించి పనిచేయాలి.. అందుకే లాక్‌డౌన్ చేస్తున్నం..’’ అని సీఎం అన్నారు. ‘‘ఆదివారం రాత్రి నుంచి పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్ బందై పోయినయి. దేశానికి బయటినుంచి వస్తున్న వ్యక్తులు ఆగిపోతున్నరు. షికాగో నుంచి ఒక్క ఫ్లైట్ శంషాబాద్‌కు వచ్చేది ఉంది. అది ఢిల్లీలో ల్యాండ్ అయింది. మనకు ఫారిన్ నుంచి వచ్చే బీమార్ అవస్త బంద్ అయినట్లే” అని తెలిపారు.
31 దాకా ఇంటిని దాటొద్దు
‘‘మన కోసం మనం, జనం కోసం జనం, అందరి కోసం అందరం పరితపించి పనిచేయాల్సిన సిచ్చువేషన్ ఇది. ఆదివారం జనతాకర్ఫ్యూలో చూపిన క్రమశిక్షణ, పట్టుదల ఖచ్చితంగా మార్చి 31 వరకు చూపించాలి. ఇలా చేస్తే కరోనాపై అద్భుతంగా విజయం సాధించొచ్చు” అని సీఎం అన్నారు. మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్లో ఉంటుందని తెలిపారు. అప్పటివరకు ఎవరి ఇండ్లకు వాళ్లు పరిమితం కావాలని, సూచా తప్పకుండా పాటించాలన్నారు. సర్వజనుల హితం కోరి లాక్‌డౌన్ ప్రకటిస్తున్నామని చెప్పారు. 1897 ఎసెన్షియల్ ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. ‘‘ఈ నెల 31దాకా ఎవరు ఇంటిని దాటొద్దు. ఐదుగురికి మించి ఎవరూ గుమి గూడొద్దు. ఇది ఖచ్చితంగా ఫాలో కావాలి. సీరియస్‌గా ఉంటది. బయటకు వచ్చినా కూడా 3 ఫీట్ల డిస్టెన్స్పైనే మెయింటేన్స్ చేసుకోవాలి. ఇంటి కోసం కావాల్సిన మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసరాల సేకరణ కోసం కుటుంబానికి ఒకరిని మాత్రమే పర్మిట్ చేస్తం. ఇట్ల ఇంట్లో నుంచి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి ఆ వస్తువులు తెచ్చికోవాలి. వీలైతే రెండుమూడు రోజులకు సరిపోయేన్ని తెచ్చుకోవాలి. మనను కాపాడుకోవాలనే సోయిలో ఉండాలి” అని సీఎం పేర్కొన్నారు.
నిత్యావసరాలు దొరుకుతయ్
నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, పండ్లు, ఇతర సరుకులు అమ్మే దుకాణాలు తెరిచే ఉంటాయని సీఎం తెలిపారు. ఎల్పీజీ సిలిండర్లు సరఫరా ఉంటుందని, పెట్రోల్ బంకులు తెరిచే ఉంటాయని చెప్పారు. ‘‘ఇంటికి ఒక్కరిని పోయి పాలు, కూరగాయలు తెచ్చుకోమన్నమని.. సందు దొరికింది కాబట్టి బయటికి పోవద్దు. నా అసుంటోడు మ్యాడ్‌గా పోతే ఇంకెవ్వళ్లో అంటిస్తే కరోనా వస్తది.. జాగ్రత్తగా ఉండాలే’’ అని సీఎం సూచించారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని బంద్ చేస్తామని, వైన్స్ కూడా బంద్ చేస్తామని తెలిపారు.
అంగన్వాడీ సెంటర్లు క్లోజ్
అంగన్వాడీ సెంటర్లను మూసేస్తున్నామని సీఎం తెలిపారు. అక్కడ ఉండే మహిళలు, పిల్లలకు ఇబ్బందులు రాకుండా వాళ్లకే సరుకులు అందించేలా చూస్తున్నామని చెప్పారు. ప్రసవాలకు సిద్ధంగా ఉన్న గర్భిణుల లిస్టు రెడీ చేస్తున్నామని, వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా చూస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసరం లేని సర్జరీలను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కరోనా వైరస్‌పై ప్రతి రోజూ ఆరోగ్య మంత్రి బులెటిన్ విడుదల చేస్తారని తెలిపారు.
బస్సులు, రైళ్లు నడువవ్
ఈ నెల 31 వరకు రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, రైళ్లు, ఆటోలు, ట్యాక్సీలు నడువవని, అనుమతించబోమని సీఎం స్పష్టం చేశారు. ‘‘ప్రజలు గుమిగూడొద్దన్నదే దీని ఉద్దేశం. మన ఇంట్ల మనమే ఉంటే బస్సులెందుకు, ఆటోలెందుకు..? పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ క్లోజ్ చేస్తం.. ఎవరినీ రానియ్యం.. చీమను, దోమను కూడా స్టేట్‌లోకి రానియ్యం. ఆటోలు, ట్యాక్సీలు రోడ్ల మీదికి రావొద్దు.. ఆల్ స్టేట్ బార్డర్స్ క్లోజ్ చేస్తున్నం. మందులు, రైస్, కూరగాయలు తెచ్చే లారీలను మాత్రమే అనుమతిస్తం. ఇంకా అంతా ఏడెనిమిదిరోజులే.. సంయమనం పాటించుకోవాలె” అని అన్నారు. ఆల్ ఇంటర్‌స్టేట్ బార్డర్స్క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వార్తల సేకరణ కోసం బయట తిరగవచ్చని, గుంపులు, గుంపులుగా కాకుండా పద్ధతి ప్రకారం పనిచేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్‌తో భయంకరంగా దెబ్బతింటున్న దేశం ఇటలీ అని, అక్కడివాళ్లే చెడగొట్టుకున్నారని సీఎం అన్నారు. అక్కడ రోజుకు ఐదారు వందల మంది చనిపోతున్నారని, ఆ దుర్గతి మనకు రావొద్దంటే వందకు వంద శాతం స్వయం నియంత్రణ పాటించాలని సూచించారు. ‘‘కుక్కలు మాట్లాడుకుంటున్నట్లు ఓ జోక్ తిరుగుతున్నది. రోడ్లమీద మనుషులు కనపడ్తలేరు.. బల్దియా వాళ్లు పట్టుకపోయిండ్రా అని కుక్కలు అనుకుంటున్నయట” అని సీఎం తెలిపారు. విదేశాలకు వెళ్లి వచ్చినవాళ్లు వెంటనే తమ వివరాలు అధికారుల వద్ద రిపోర్టు చేయాలన్నారు. ‘‘ఇది దు:ఖ సమయం..ఇంత పెద్ద మానవ జాతి ఫైట్ చేస్తున్న సమయంలో ఆషామాషిగా తీసుకోవద్దు. ఒక వారం నియంత్రణ.. ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది. మన భవిష్యత్ తరాలను కాపాడుతుంది” అని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రొటేషన్ పద్ధతి
‘‘ప్రభుత్వ ఉద్యోగులు అందరు కూడా ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు. 20 శాతం రొటేషన్ పద్ధతిలో రావాలి. దీనికి సంబంధించిన వివరాలు జీవో ద్వారా సీఎస్ విడుదల చేస్తరు. ఎమర్జెన్సీ సర్వీసులైన కరెంట్, వాటర్ సప్లయ్, సీవరేజీ, మున్సిపల్ సిబ్బందికి ఇది వర్తించదు. వీళ్లు 100 శాతం రావాల్సిందే” అని సీఎం తెలిపారు. ఎడ్యుకేషన్డిపార్ట్మెంట్ పనులు అన్నీ మూసేస్తున్నామని చెప్పారు. పేపర్ వాల్యుయేషన్ వంటివి ఏవీ ఉండవని, ఈ నెల 31 తర్వాత రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు ఎవరి ఎక్కడోళ్లకక్కడ ఇండ్లల్లో ఉండొచ్చని సూచించారు. ‘‘1897 యాక్ట్.. బిల్డింగ్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా వర్తిస్తది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇతర ఉద్యోగులకు విధిగా ఎంప్లాయర్ వేతనం చెల్లించాల్సిందే.. ప్రభుత్వం కూడా చెల్లిస్తది. లాభాలు వస్తనే తీసుకుంటమని కాదు.. క్రైసిస్ సిచువేషన్ ఉన్నప్పుడు
రేషన్ కార్డుంటే ఫ్రీ బియ్యం, రూ. 1500
‘‘లాక్‌డౌన్‌తో పేదలకు కూలీ పనికి పోయే పరిస్థితి ఉండదు. అలాంటి వారు చాలా మంది ఉంటరు. నిరుపేదలు ఆకలికి గురి కావొద్దు.. వారం మొత్తం పనులు ఆగిపోతే దాని ప్రభావం ఇంకో 15 రోజులపై పడుతుంది.. అందుకే వాళ్లకు నెలకు సరిపడా బియ్యం ఇవ్వాలని నిర్ణయించినం. రాష్ట్రంలో 1.03 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. 87.59 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులున్నయి. ఈచ్ పర్సన్‌కు ఫ్రీగా 12 కేజీల రైస్ ఇస్తం.. వీలైనంత త్వరగా డీలర్ల ద్వారా వాటిని అందజేస్తాం. ఇందుకు రూ.1,103 కోట్లు ఖర్చు అవుతయి. పప్పు, ఉప్పు, చింతపండు, ఇతర సరుకులు కొనుక్కోవడానికి ప్రతి రేషన్ కార్డుకు రూ.1,500 నగదు రూపేణ ఇస్తం.. ఇందుకు రూ.1,314 కోట్లు ఖర్చు అవుతుంది” అని సీఎం తెలిపారు. మొత్తమ్మీద రూ. 2417 కోట్లు ప్రభుత్వం తక్షణం విడుదల చేస్తుందని చెప్పారు.
1897 యాక్ట్ పవర్‌ఫుల్
1897 యాక్ట్ చాలా పవర్‌ఫుల్ అని, దాని ప్రకారం ప్రభుత్వానికి ఏ పవర్ అయినా ఉంటుందని సీఎం తెలిపారు. జిల్లా కలెక్టర్లు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్లకు జ్యుడిషియరీ అధికారాలు ఉంటాయని చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో 33 జిల్లాల కలెక్టర్లు, డీజీపీ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్లు ఎస్పీలు పనిచేస్తారన్నారు. వారికి సీఎం కారును కూడా హ్యాండోవర్ చేసుకొని ఎమర్జెన్సీ సర్వీసులకు ఉపయోగించుకునే అధికారం ఉంటుందని ఆయన తెలిపారు.
For More News..