గృహ నిర్మాణ రంగానికి దండిగా నిధులు

గృహ నిర్మాణ రంగానికి దండిగా నిధులు

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండటంతో మోడీ ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది. పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ మరో విడత ప్రత్యేక పథకాలు, రాయితీలు ప్రకటించారు. గతంలో బ్యాంకులు, బీమా, ఎఫ్‌‌పీఐలు, వాహన కంపెనీల కోసం పలు ఉద్దీపనలు ప్రకటించగా, ఈసారి ఎగుమతులు, గృహనిర్మాణరంగాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎగుమతులను పెంచడానికి మొత్తం ఆరు నిర్ణయాలను ప్రకటించారు. దుబాయ్‌‌ మాదిరిగా వచ్చే ఏడాది నుంచి మెగా ఆన్యువల్‌‌ షాపింగ్‌‌ ఫెస్టివల్‌‌ నిర్వహిస్తామని, ఎగుమతిదారుల కోసం కొత్త ఆటోమేటిక్ రీఫండ్‌‌ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఎగుమతులను   ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కొత్త ఆర్‌‌ఓడీటీఈపీ పథకాన్ని ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. వీటి అమలుకు రూ.50 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన హౌసింగ్‌‌ ప్రాజెక్టులను తిరిగి మొదలుపెట్టడానికి స్ట్రెస్‌‌ఫండ్ అందిస్తామన్నారు.

ఎగుమతుల రంగానికి…

ఎగుమతులను ఇంకా ప్రోత్సహించడానికి, ట్యాక్స్‌‌ రీఫండ్ల కోసం ‘రీయింబర్స్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ ట్యాక్సెస్‌‌ అండ్‌‌ డ్యూటీస్‌‌ ఫర్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌‌ ప్రమోషన్‌‌’ పథకాన్ని కొనసాగిస్తారు.  మర్చెండైజ్‌‌ ఎక్స్‌‌పోర్ట్స్‌‌ ఫ్రం ఇండియా స్కీమ్‌‌ (ఎంఈఐఎస్‌‌) స్థానంలో రెమిషన్‌‌ ఆఫ్‌‌ డ్యూటీస్‌‌ ఆర్‌‌ ట్యాక్సెస్‌‌ ఆన్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌‌ ప్రొడక్ట్‌‌ (ఆర్‌‌ఓడీటీఈపీ) పథకాన్ని ఈ ఏడాది డిసెంబరు నుంచి అమలు చేస్తారు. వీటి అమలుకు రూ.50 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుతం ఎంఈఐఎస్‌‌పై  జౌళి, ఇతర కొన్ని రంగాలకు రెండు శాతం ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఆర్‌‌ఓడీటీఈపీ అమలు వల్ల ఎగుమతులకు మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయి.

జీఎస్టీలో ఇన్‌‌పుట్‌‌ ట్యాక్స్‌‌ క్రెడిట్‌‌ (ఐటీసీ) కోసం  ఫుల్లీ ఆటోమేటెడ్‌‌ ఎలక్ట్రానిక్‌‌ రీఫండ్‌‌ రూట్‌‌ను అమలు చేస్తారు. దీనివల్ల వేగంగా ఐటీసీలు అందుతాయి.   ఎగుమతిదారులకు అప్పుల జారీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సంబంధిత వివరాలను ఆర్‌‌బీఐ  వెల్లడిస్తుంది. ఎక్స్‌‌పోర్ట్‌‌ క్రెడిట్‌‌ గ్యారంటీ కార్పొరేషన్‌‌ (ఈజీసీజీ) అమలు చేసే ఎక్స్‌‌పోర్ట్‌‌ క్రెడిట్‌‌ ఇన్సూరెన్స్‌‌ స్కీమ్‌‌ (ఈసీఐఎస్‌‌)ను మరింత విస్తరిస్తారు. ఎగుమతులకు వర్కింగ్‌‌ క్యాపిటల్‌‌ అందించే బ్యాంకులకు మరింత బీమా కవరేజీ ఉంటుంది. ప్రైవేట్‌‌ సెక్టార్‌‌ లెండింగ్‌‌ను ప్రోత్సహిస్తారు. దీనివల్ల రూ.68 వేల కోట్ల వరకు ఎక్స్‌‌పోర్ట్‌‌ క్రెడిట్‌‌ అందుబాటులోకి వస్తుంది.

–సంజీవ్‌‌ హోతా, రీసెర్చ్ హెడ్‌‌, షేర్‌‌ఖాన్‌‌

కొన్ని ముఖ్యాంశాలు

చవక గృహాల ప్యాకేజీకి రూ.20 వేల కోట్ల స్ట్రెస్‌‌ఫండ్‌‌ ఇవ్వడం వల్ల  3.5 లక్షల మంది ఇళ్ల యజమానులకు మేలు కలుగుతుంది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల ఫ్లాట్ల నిర్మాణం నిలిచిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో దుబాయి తరహా ఆన్యువల్‌‌ షాపింగ్‌‌ ఫెస్టివల్స్‌‌ ఏర్పాటు చేస్తారు. వీటిలో యోగా, జౌళి, టూరిజం, లెదర్‌‌ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు.

ఎగుమతిదారులు సులువుగా ఇన్‌‌పుట్‌‌ క్రెడిట్లు పొందేందుకు జీఎస్టీ విధానంలో మార్పులు తెస్తారు. ఇక నుంచి త్వరగా క్రెడిట్లు ఇస్తారు.

ఎగుమతులు త్వరగా గమ్యస్థానాలకు చేరేలా పోర్టులు, ఎయిర్‌‌పోర్టులు, కస్టమ్‌‌ విభాగాలు త్వరగా అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు.

గత నెల ఇండియా ఎగుమతుల విలువ 6.05 శాతం తగ్గి 26.13 బిలియన్‌‌ డాలర్లుగా నమోదయింది.  ద్రవ్యలోటు గత ఆగస్టులో 17.92 మిలియన్ డాలర్లు కాగా, ఈసారి ఆగస్టులో 13.45 మిలియన్ డాలర్లకు తగ్గింది.

రాబోయే ఐదేళ్లలో మనదేశ ఎగుమతుల విలువను మూడు రెట్లు పెంచి లక్ష కోట్ల డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.   ద్రవ్యోల్బణం  అదుపులోనే ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014 నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ రిటర్నుల దాఖలులో చిన్నచిన్న తప్పులు జరిగితే గతంలో మాదిరి పెద్ద చర్యలు ఉండవు.  జీడీపీ వృద్ధి  గాడినపడుతుంది.

– కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌

గృహనిర్మాణ రంగానికి
దండిగా నిధులు

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన హౌసింగ్‌‌ ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి స్పెషల్‌‌ విండోను మొదలుపెడతారు. ఇందులో భాగంగా రూ.20 వేల కోట్లతో స్ట్రెస్‌‌ఫండ్‌‌ ఏర్పాటు చేస్తారు. అయితే ఎన్‌‌పీఏ, ఎన్సీఎల్టీ ఇబ్బందులు ఉన్న ప్రాజెక్టులకు దీని నుంచి సాయం అందదు. ప్రభుత్వం రూ.10 వేల కోట్లు, ఎల్‌‌ఐసీ, క్యాపిటల్‌‌ బ్యాంకులు, సావరిన్‌‌ ఫండ్లు, డీఎఫ్‌‌ఐలు రూ.10 వేల కోట్లు ఇస్తాయి.   ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లు కొనుక్కునేలా ప్రోత్సహించడానికి హౌస్‌‌ బిల్డింగ్ అడ్వాన్సులపై వడ్డీరేట్లు తగ్గిస్తారు.  ప్రధానమంత్రి ఆవాస్‌‌ యోజన కింద చేపట్టిన హౌసింగ్‌‌ ప్రాజెక్టులకు విదేశీ రుణాలు (ఈసీబీలు) సులువుగా దొరికేందుకు ఈసీబీ రూల్స్‌‌ను మరింత సరళీకరిస్తారు. ఇందుకోసం ఆర్‌‌బీఐతో సంప్రదింపులు జరుపుతారు. మధ్యతరగతి ఇళ్ల ప్రాజెక్టులు ఈసీబీలు సేకరించడానికి ఇది వరకే అనుమతి ఉంది.