మహబూబ్‌నగర్, వెలుగు: లిక్కర్ సేల్స్ పెంచాలని సర్కారు చెబుతుండడంతో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వీటిని నివారించాల్సిన ఎక్సైజ్, పోలీస్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వంద మందికి ఒక బెల్టు షాపు చొప్పున వెలిశాయి. కేవలం కర్ణాటక, గోవా ప్రాంతాల నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్న వారిపై దాడులు చేస్తూ బెల్ట్‌షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
రెండేళ్లలో 24 కేసులే..
మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల్లో 441 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో పెద్ద గ్రామ పంచాయతీల్లో 12 నుంచి 15, చిన్న జీపీలలో 8 నుంచి 10 బెల్టు షాపులున్నాయి. 20 కుటుంబాలు ఉండే గిరిజన తండాల్లో రెండు నుంచి మూడు షాపులు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 3,500లకు పైగా బెల్ట్ షాపులున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం చుట్టూ 60 బెల్టు షాపులున్నట్లు సమాచారం. ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నా 2021లో 13 కేసులు, 2022లో 11 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.
లిక్కర్ అమ్మకంతో ఫుల్ ఆదాయం..
మద్యం దుకాణాల నుంచి లిక్కర్ తెచ్చి అమ్మితే ఆదాయం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోని కిరాణ షాపుల ఓనర్లు ఈ దందా చేస్తున్నారు. సిగరెట్లు, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అమ్ముకునే చిన్న డబ్బాల వారు లీటర్ వాటర్ బాటిల్లో ఒక క్వార్ట ర్ లిక్కర్ కలిపి అమ్ముతున్నారు. ఈ డబ్బాలలో కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. కిరాణా షాపుల్లో మాత్రం బీర్లు, ధర ఎక్కువ ఉండే బ్రాండ్లు ఉంచుతున్నారు. కొందరు ఇంట్లోనే సిట్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దుకాణాల పక్కనే ఖాళీ జాగాలో రేకుల షెడ్ వేసి కుర్చీలు, టేబుల్స్‌తో సర్వ్ కూడా చేస్తున్నారు.
మామూళ్లు ‘డబుల్’
వైన్స్ షాపుల వారు బెల్ట్ షాపుల ఓనర్లకు క్వార్టర్ మీద రూ.10, హాఫ్ మీద రూ.20, ఫుల్ బాటిల్ మీద రూ.40 ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ డబ్బులను వైన్స్ ఓనర్లు ఆఫీసర్లు, బీఆర్ఎస్ లీడర్లకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులు క్వార్టర్ మీద రూ.20 నుంచి రూ.30, ఫుల్ బాటిల్ మీద రూ.80 నుంచి రూ.వంద అదనంగా వసూలు చేస్తున్నారు.
ఎక్సైజ్ ఆఫీసర్లకు టార్గెట్
ఆదాయం కోసం సేల్స్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వంఎక్సైజ్ ఆఫీసర్లకు టార్గెట్లు ఇస్తోంది. జిల్లాలోని ఓ మండలంలోని మూడు వైన్స్లలో ఇటీవల రూ.5 కోట్ల సేల్స్ జరిగాయి. వచ్చే నెల సేల్స్‌ను రూ.6 కోట్లకు పెంచాలని సూచనలు వచ్చినట్లు ఓ ఎక్సైజ్ సీఐ ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పారు. రూ.5 కోట్లకు మాత్రం సేల్స్ తగ్గకుండా చూసుకోవాలని చెప్పారన్నారు. సేల్స్ పెంచిన ఆఫీసర్లను నెలవారీ సమావేశాల్లో ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
తాగి పడేసిన గ్లాసులు ఇంట్లోకి వస్తున్నయ్
మా ఇంటికి దగ్గర్లోనే ఓపెన్ ప్లేస్‌లో లిక్కర్ అమ్ముతున్నారు. పక్కనే ‘రియల్’ వెంచర్ ఉంది. అందరూ అక్కడ మద్యం తాగివెళ్తున్నారు. గ్లాసులు, కవర్లు, పేపర్లు గాలికి మా ఇంటి వాకిట్లోకి వస్తోంది. రోజూ ఊడ్చుకోలేక యాష్టకొస్తోంది.
- చెన్న కిష్టమ్మ, అడ్డాకుల
8 షాపులు ఉన్నయ్..
బండమీదిపల్లి వద్ద ఒక వైన్స్ ఉంది. రాత్రి 10 గంటలకు బంద్ పెడ్తరు. పక్కనే మా ఊరు ఉంది. ఇక్కడ 8 బెల్టు షాపులున్నాయి. వైన్స్ బంద్ అయితే అందరూ మా ఊరికి వచ్చి తాగి ఒర్లుకుంటూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. తాగుబోతులతో తిప్పలు పడుతున్నాం.
- మల్లేశ్ యాదవ్, అల్లీపూర్