నల్గొండలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు ఫుల్​ ఇన్​కం

  • కొత్త రేట్లతో రియల్​ జోష్!

  • ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు ఫుల్​ ఇన్​కం

  • గత ఏడాది తో పొలిస్తే రూ.46.64 కోట్లు ఎక్కువ

  • రూ. 299 కోట్లు తెచ్చిపెట్టిన రియల్ సేల్స్​

  • గత ఏడాది ఇదే టైంలో రూ. 255 కోట్లు

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు మస్తు​ఆదాయం వస్తోంది. ప్రభుత్వం పెంచిన రేట్లతో అదనపు ఆదాయం సమకూరుతోంది. గతంలో ఉన్న రేట్లతో పోలిస్తే  స్టాంపు డ్యూటీ, మార్కెట్​వాల్యూ, సీసీ, ఈసీల ధరలు భారీగా పెరిగాయి. ఆర్ధిక మాంద్యం, పెరిగిన ధరలతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా   జరగకపోయినప్పటికీ గతంలో చేసుకున్న అగ్రిమెంట్ల ప్రకారమే ఈ ఐదారు నెలల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆఫీసర్లు చెపుతున్నారు. ఈ ఏడాదిలో కొత్తగా వెలసిన వెంచర్ల, స్మార్ట్​ సిటీల పేరుతో నిర్మిస్తున్న ఇండ్ల అమ్మకాలు కూడా గతేడాది లాగే నామమాత్రంగా జరుగుతున్నాయని రియల్టర్లు చెప్తున్నారు. కానీ వీటిపైన వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే పెంచిన రేట్ల వల్లే సర్కారుకు కలిసొస్తుందని అర్థమవుతోంది.

96 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​.. 

ఈ ఏడాది ఏప్రిల్​1 నుంచి నవంబర్​ 30 వరకు ఉమ్మడి జిల్లాలోని15 సబ్​ రిజిస్ట్రేషన్​ఆఫీసుల్లో 96,531 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.299.64 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే  టైంలో 96,999 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్​ కాగా, రూ.253 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు సర్కార్​కు అదనంగా రూ.46.64 కోట్ల ఆదాయం పెరిగింది. రెండేళ్లలో రెండుసార్లు భూములు రే ట్లు పెంచడంతోపాటు, స్టాంపు డ్యూటీ 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచారు. దీంతోపాటు గిఫ్ట్​డీడ్​ పర్సంటేజీ 3 నుంచి 4 శాతానికి, ఈసీలు, సీసీల ధరలు 2 వందల నుంచి 5వందలకు పెంచారు. ఖాళీ జాగాలు, ప్లాట్లు కాకుండా, ఇళ్లను కొనుగోలు చేస్తున్న వారిపై రియల్​ భారం ఎక్కువగా పడుతోంది. మార్కెట్​ వాల్యూ పెరగడంతో ప్లాట్లు రేట్లు విపరీతంగా పెరిగాయి. అదే విధంగా గేటెడ్​ కమ్యూనిటీలో నిర్మించిన ఇండ్లను కొనుగోలు చేయాలన్న స్టాంపు డ్యూటీ భారం ఎక్కువగా ఉంటోంది. 

టాప్​ వన్​లో నల్గొండ .. 

రిజిస్ట్రేషన్లు ఆదాయంలో నల్గొండ టాప్​వన్​లో నిలిచింది. అత్యధికంగా రూ.44.70 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో ప్లేస్​లో యాదగిరిగుట్ట సబ్​ రిజిస్ట్రార్​ పరిధిలో రూ.42.17 కోట్లు, భువనగిరి పరిధిలో రూ.39.14 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గతేడాది వెనకబడ్డ రూరల్​ మండలాల్లో కూడా ఈ ఏడాది గాడినపడ్డాయి. పెరిగిన ధరలతో రూరల్​ఏరియాల్లోని నిడమనూరు, రామన్నపేట, చండూరు, మోత్కూరు, నకిరేకల్​ మండలాల్లో కూడా ఓ మోస్తారుగానే భూముల క్రయ, విక్రయాలు జరిగాయి. ఎక్కువగా జాతీయ, రాష్ట్ర రహదారులను ఆనుకుని ఉన్న చౌటప్పుల్​, సూర్యాపేట, నల్గొండ, కోదాడ, మిర్యాలగూడ, చౌటుప్పల్, బీబీనగర్​మండలాల పరిధిలో జరిగిన భూముల క్రయ, విక్రయాల ద్వారానే సర్కార్​కు భారీగా ఆదాయం సమకూరింది.