- ఎప్పటిలాగే క్వింటాలుకు 7 నుంచి10కిలోల దాకా కోతలు
- కొన్ని చోట్ల సొసైటీల్లోనే కటింగులు
- నిండా మునుగుతున్న రైతులు
- ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు
ఖమ్మం, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లర్ల తీరుతో రైతులకు తరుగు పేరుతో తూకంలో కోతలు తప్పడం లేదు. మొన్నటి వరకు మిల్లుల్లో ధాన్యం అన్ లోడ్ చేసుకునేందుకు తరుగు తీయాలంటూ మిల్లర్లు మెలిక పెట్టగా, ఇప్పుడు ఏకంగా సొసైటీలు, ఐకేపీ సెంటర్లలో నిర్వాహకులే రైతుల ధాన్యాన్ని కాంటా వేసే సమయంలో తరుగు తీస్తున్నారు. కొన్ని సెంటర్లలో బస్తాకు ఏడు కిలోల నుంచి10 కిలోల వరకు కట్ చేసుకున్న తర్వాతే తూకాలను లెక్కలేస్తున్నారు. రైతులు కూడా చేసేదేం లేక, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ చేయలేక కోతలకు ఒప్పుకుంటున్నారు.
దీంతో లారీ లోడయ్యాక మిల్లుకు తరలిస్తున్న క్రమంలో పెద్దగా ఆలస్యం కావడం లేదు. అయితే గత వారం మంత్రి అజయ్కుమార్నిర్వహించిన జిల్లాస్థాయి మిల్లర్లు, ఆఫీసర్ల సమీక్షలో తరుగు తీయొద్దని, మిల్లుల దగ్గర అన్లోడింగ్ ఆలస్యం చేయొద్దని, ప్రభుత్వానికి, రైతులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఇచ్చిన వార్నింగ్ కూడా పనిచేయడం లేదు. స్వయంగా రైతులే తరుగు తీసేందుకు అంగీకరించేలా పరిస్థితిని కల్పించడంలో మిల్లర్లు, సొసైటీ నిర్వాహకులు సక్సెస్ అయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మిల్లును సీజ్ చేసినా...
మంత్రి అజయ్ స్వయంగా వార్నింగ్ ఇవ్వడంతోపాటు, కలెక్టర్వీపీ గౌతమ్ఇటీవల ఓ మిల్లును సీజ్‌చేశారు. ధాన్యం అన్లోడ్ చేసుకోవడంలో నిర్లక్ష్యంతోపాటు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం విషయంలో రిజిస్టర్లు సరిగా మెయింటైన్ చేయకపోవడంతో పెనుబల్లి మండలం అడవిమల్లెలలోని శ్రీలక్ష్మీశ్రీనివాస పారాబాయిల్డ్ రైస్ మిల్లుపై యాక్షన్తీసుకున్నారు. మిల్లులోని రూ.17.84 కోట్ల విలువైన ధాన్యాన్ని సీజ్ చేశారు. కొందరు మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకోవడం కంటే మార్కెట్లో నేరుగా తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని కలెక్టర్‌దృష్టికి రావడంతో ఆఫీసర్లతో పలు మిల్లులపై దాడులు చేయించారు. అందులో భాగంగానే పెనుబల్లి మండలంలోని మిల్లుపై యాక్షన్తీసుకున్నారు. దీని తర్వాత మిల్లర్లలో కొంత భయం కనిపించినా, తరుగు పేరుతో కోతల్లో మాత్రం పెద్దగా తేడా లేదని రైతులు చెబుతున్నారు.
స్థానిక లీడర్లలో గుబులు...
ఇక తరుగు పేరుతో కోతల ద్వారా తమపై ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనని స్థానిక ప్రజాప్రతినిధులు భయపడుతున్నారు. కొన్ని చోట్ల రైతుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో, మిల్లర్లతో మాట్లాడి తక్కువ తరుగు తీసేలా వాళ్లను ఒప్పిస్తున్నారు. అయితే విపక్ష నేతలు మాత్రం మిల్లర్లకు అధికార పార్టీ నేతలు ఫుల్ సపోర్ట్ చేయడంతోనే రైతులపై అంత కఠినంగా వ్యవహరిస్తూ, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారం క్రితం పాలేరు నియోజకవర్గంలోని ఓ సొసైటీ నుంచి రైస్‌మిల్లుకు మూడు లారీల ధాన్యం పంపించారు.
వడ్లు పచ్చిగా ఉన్నాయని, తేమ శాతం ఎక్కువగా ఉందని, అన్ లోడ్ చేయాలంటే క్వింటాలుకు12 కిలోల తరుగు తీయాలంటూ మిల్లర్ మెలిక పెట్టాడు. దీంతో ఆ సొసైటీ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధి ఓ మండలస్థాయ లీడర్ ను సంప్రదించారు. ఎక్కువ తరుగు తీస్తే సొంతూర్లో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటూ చెప్పుకున్నారు. దీంతో ఆ లీడర్ స్వయంగా రైస్ మిల్లుకు వెళ్లి మాట్లాడడంతో చివరకు క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగుతో అన్ లోడ్ చేసుకున్నారు.