- అంతటా సిబ్బంది సమస్య
- హోంగార్డులే ఫైర్ మెన్లు
- బండ్లు నడపడానికి ఆర్టీసీ డ్రైవర్లే దిక్కు
- ప్రమాదాల నియంత్రణలో విఫలం
- పెరిగిపోతున్న ఆస్తి నష్టం
నల్గొండ, వెలుగు: ఆపదలో ఆదుకోవాల్సిన అగ్నిమాపక కేంద్రాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. సుశిక్షితులైన సిబ్బంది కొరతకు తోడు నీటి సమస్య సిబ్బందికి కన్నీళ్లు తెప్పిస్తోంది. మరికొన్ని స్టేషన్లలో కాలం చెల్లిన వాహనాలు సైతం సహనానికి పరీక్ష పెడుతున్నాయి. భారీ అగ్ని ప్రమాదం జరిగితే వీలైనంత త్వరగా ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 ఫైర్ స్టేషన్లలో సగానికి పైగా నీటి సమస్యతో అల్లాడుతున్నాయి. దాదాపు అన్ని స్టేషన్లలో అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి పదేళ్లు దాటింది.
వీటిల్లో కొ న్ని వాహనాలు రిపేర్లతో తరచూ మొరాయిస్తున్నాయి. రామన్నపేటలో ప్రైవేటు ఏజెన్సీతో కాంట్రాక్టు పద్ధతిన ఫైర్ స్టేషన్ సేవలందిస్తోంది. అగ్ని ప్రమాదాలు అత్యధికంగా సంభవించే వేసవిలో నాగార్జునసాగర్ కాల్వలు మూసేయడంతో నీటి కోసం సిబ్బంది అనేక తంటాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో కోదాడ, నకిరేకల్, దేవరకొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియాస్టేషన్ల సిబ్బంది నీటి కోసం కుంటలు, కాలువల వెంట పరుగులు తీయాల్సి వస్తోంది. వాస్త వానికి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో నీటి వసతి కోసం పక్కా ట్యాంకర్ల నిర్మాణం చేపట్టాలి.
భారీగా సిబ్బంది కొరత..
సమయస్ఫూర్తి, నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మంటలను ఆర్పడంలో కీలకపాత్ర పోషించే ఫైర్‌మెన్‌ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. స్టేషన్‌కు 10 మంది చొప్పున మొత్తం 100మంది ఫైర్మెన్లు ఉండాలి. కానీ స్టేషన్లలో ఐదారుగురు మించి లేరు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిన పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన హోంగార్డులు, ఆర్టీసీ డ్రైవర్ల సాయంతో పని పూర్తి చేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్లు చెపుతున్నారు.
బోర్లు ఎండిపోతే అంతే సంగతి...
కొన్ని స్టేషన్లలో బోర్ వసతితో పాటు, నీటిని నిల్వ చేసుకునే వాటర్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి. కోదాడ స్టేషన్లో బోర్ఎండిపోగా, నకిరేకల్ లో మార్కెట్ యార్డ్‌లోని బోరు పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇంక మండువేసవిలో బోర్లు ఎండిపోతే అన్ని స్టేషన్లలో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. మున్సిపల్వాటర్, కాలవలు, చిన్న నీటి కుంటల పైన తప్పని సరి పరిస్థితుల్లో ఆధారపడాల్సి వస్తోంది.
పెరుగుతున్న అగ్నిప్రమాదాలు...
గత మూడేళ్ల నుంచి అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగడంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగానే వాటిల్లుతోంది. ట్రాక్టర్లు, లారీలు మోతాదుకు మించి గడ్డిని రవాణా చేయడం వల్ల జరిగే విద్యుత్ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అదేవిధంగా పంట కోతల తరువాత మిగిలిన చెత్తను తగలబెట్టడం వల్ల జరిగే ప్రమాదాలు, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు తదితర సంఘటనలు ఎక్కువ సంఖ్యలో చోటుచేసుకుంటున్నా యి. 2020లో 846 ప్రమాదాలు జరిగితే 2021లో కరోనా వల్ల ప్రమాదాల సంఖ్య 434కు పడిపోయింది. మళ్లీ 2022లో 560కి చేరింది. ఈ ఏడాది ఈ సీజన్లో ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.
ఇక ఆస్తినష్టం పరిశీలిస్తే ...
2020లో రూ.43.98 లక్షల నష్టం వాటిల్లితే, రూ.111.83 కోట్ల ఆస్తిని కాపాడారు. అదేవిధంగా 20 21లో రూ.38.64 లక్షల నష్టం వాటిల్లితే రూ.17.44 కోట్ల ఆస్తిని కాపాడారు. అదే 2022కు వచ్చే సరికి నష్టం రూ.5.93కోట్లు జరిగితే..రూ.18 .73 కోట్ల ఆస్తిని కాపాడారు. గడిచిన మూడేళ్లలో 79 మంది మృత్యు వాతపడగా, 59 మందిని కాపాడారు.
ఫిర్యాదులకు వెంటనే స్పందిస్తున్నం
అగ్రిప్రమాదాలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణమే నివారణ చర్యలు చేపడుతున్నాం. స్టాఫ్ కొరత ఉంటే ఇతర డిపార్ట్మెంట్ల నుంచి సపోర్ట్ తీసులకుంటున్నాం. బోర్లు పనిచేయకున్నా, అత్యవసర పరిస్థితుల్లో నీటి కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుం టున్నాం. ప్రతి స్టేషన్లో నీటిని స్టోర్ చేసు కునేందుకు ట్యాంకులు ఏర్పాటు చేసినం.
- షణ్ముకరావు, ఏడీఎఫ్‌ఓ, నల్గొండ