బస్టాండ్లలో రిటర్న్‌‌‌‌ రష్‌‌‌‌: వాహనాలతో నిండిన రోడ్లు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌లు

బస్టాండ్లలో రిటర్న్‌‌‌‌ రష్‌‌‌‌: వాహనాలతో నిండిన రోడ్లు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌‌‌‌ జామ్‌‌‌‌లు
  • పండుగ ముగియడంతో తిరుగుముఖం పట్టిన ప్రజలు
  • కిక్కిరిసిన బస్టాండ్లు.. బస్సులు దొరకక పాట్లు
  • పండుగ సీజన్‌‌‌‌లో 13 రోజుల్లో 6 కోట్ల టికెట్లు అమ్మిన ఆర్టీసీ
  • ఆర్టీసీకి రోజుకు సగటున రూ. 19 కోట్ల ఆమ్దానీ

కరీంనగర్‌‌‌‌/నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు : బతుకమ్మ, దసరా సెలవులు ముగియడంతో ఊళ్లకు వచ్చిన జనం పట్నం బాట పట్టారు. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లే వారితో పాటు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. ఆదివారం నుంచే మొదలైన రద్దీ సోమవారానికి మరింత పెరిగింది.రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌‌‌‌కు, అలాగే మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు అదనపు ఆర్టీసీ బస్సులు నడిపినా రద్దీకి సరిపోలేదు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే వెయిట్‌‌‌‌ చేశారు. బస్సుల్లో రద్దీ తట్టుకోలేక కొందరు ప్రైవేట్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ను ఆశ్రయించారు. తిరుగు ప్రయాణం కోసం కార్లు, బైక్‌‌‌‌లు రోడ్డెక్కడంతో చాలా చోట్ల ట్రాఫిక్‌‌‌‌ ఇబ్బందులు తలెత్తాయి.

రాష్ట్రమంతా సేమ్‌‌‌‌ సీన్‌‌‌‌

అన్ని జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్‌‌‌‌ కేంద్రాల్లోని ప్రధాన బస్టాండ్లు అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎలాగైనా గమ్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది సీట్లు దొరకకున్నా బస్సులు ఎక్కేశారు. దీంతో పరిమితికి మించిన ప్రయాణికులతో బస్సులను నడపాల్సి వచ్చింది. సూపర్‌‌‌‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రిజర్వేషన్‌‌‌‌ చేసుకున్న సీట్లు ఉన్నాయని చెబుతున్నా వినకుండా చాలా మంది ఆయా సీట్లలో కూర్చున్నారు.

బస్సులు ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ మీదికి రాకముందే ఎగబడి ఎక్కేశారు. ప్రధానంగా కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్‌‌‌‌, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ తదితర జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లతో పాటు ప్రధాన పట్టణాల్లోని బస్టాండ్లలో ఎటు చూసినా జనమే కనిపించారు. వరంగల్, హైదరాబాద్‌‌‌‌లో తిరిగే సిటీ బస్సులతోపాటు, గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులన్నింటినీ హైదరాబాద్‌‌‌‌కే నడపడంతో గ్రామాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

13 రోజుల్లో 6 కోట్ల టికెట్లు

బతుకమ్మ, దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని టీజీఆర్టీసీ ముందు నుంచే ఏర్పాట్లు చేసింది. ఏ రూట్లలో ఎక్కువ రద్దీ ఉంటుందో అంచనా వేసి అందుకు అనుగుణంగా బస్సులు నడిపారు. ఈ నెల 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,600 బస్సులు నడుపగా 13వ తేదీ వరకు 6 కోట్లకుపైగా టికెట్లు ఇష్యూ అయ్యాయి. ఇందులో సుమారు 4 కోట్లు మహాలక్ష్మి టికెట్లు ఉన్నట్లు అంచనా.

సోమవారం ఆర్టీసీ బస్సుల్లో మరో 50 లక్షల మంది వరకు ప్రయాణించినట్లు ఆర్టీసీ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సీజన్‌‌‌‌లో జనరల్, మహాలక్ష్మి టికెట్ల ద్వారా రోజుకు సగటున రూ.19 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. గత 14 రోజులుగా ఆర్టీసీ బస్సుల్లో 92 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

టోల్‌‌‌‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర బారులు

కరీంనగర్‌‌‌‌ – హైదరాబాద్‌‌‌‌ రూట్‌‌‌‌లోని రేణికుంట, దుద్దెడ టోల్‌‌‌‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దుద్దెడ టోల్‌‌‌‌ప్లాజా వద్ద కిలోమీటర్‌‌‌‌ మేర ట్రాఫిక్‌‌‌‌ నిలిచిపోయింది. వరంగల్‌‌‌‌ వైపు నుంచి హైదరాబాద్‌‌‌‌ వస్తున్న వాహనాలతో గూడూరు టోల్‌‌‌‌ ప్లాజా వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ టోల్‌‌‌‌ ప్లాజాలు దాటేందుకు అరగంట నుంచి గంట వరకు పట్టింది. అలాగే విజయవాడ – హైదరాబాద్‌‌‌‌  హైవేపై పంతంగి టోల్‌‌‌‌ప్లాజా వద్ద సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

ప్రైవేట్‌‌‌‌ వాహనదారుల దోపిడీ

ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరక్కపోవడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో కొందరు ప్రయాణికులు ప్రైవేట్‌‌‌‌ వాహనాలను ఆశ్రయించారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌‌‌‌కు వెళ్లే రూట్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. ఇదే అదనుగా ప్రైవేట్‌‌‌‌ వాహనదారులు డబుల్‌‌‌‌ ఛార్జీలు వసూలు చేశారు. కరీంనగర్‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌‌‌కు రూ.800, హనుమకొండ నుంచి హైదరాబాద్‌‌‌‌కు రూ.700 ఛార్జీ చేశారు. బస్సుల్లో వెళ్లలేని కొందరు ప్రైవేట్‌‌‌‌వాహనదారులు అడిగినంత ఇచ్చి ప్రయాణం చేశారు.