ఓటు వేసేందుకు సొంతూరు బాటపట్టారు భాగ్యనగరవాసులు. దీంతో ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. దాదాపు 2వేల ప్రత్యేక బస్సులు నడుపుతుంది టీఎస్‌ఆర్టీసీ. ఎన్నికలతో పాటుగా, వరుస సెలవులు కూడా రావడంతో ప్రజలు ఊళ్లకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కేపీహెచ్బీలోని బస్ స్టాప్ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. తెలంగాణతో పాటు ఏపీలో ఎన్నికలు ఉండటంతో అక్కడ ఓటు వేసేందుకు కూకట్ పల్లి, కేపీహెచ్బీ పరిసర ప్రాంతాలలో నివాసముండే ఏపీలోని వారంతా సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు.
ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ కు నిన్నటి నుంచే రద్దీ కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో 20 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రైవేటు ట్రక్ ఆపరేటర్లు కూడా బస్ చార్జీలను అమాంతం పెంచేశారు.