- ఏడాది గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని స్కీమ్
- స్లమ్ ఏరియాల్లోని పేదలకు నేటికీ వస్తున్న బిల్లులు
- పట్టించుకోని వాటర్ బోర్డు అధికారులు
హైదరాబాద్, వెలుగు: బస్తీల్లో ఫ్రీ వాటర్ సప్లయ్ నామ్‌కే వాస్తేగా మారింది. ఏడాది కిందట ప్రారంభించిన ఈ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కాలనీలు, బస్తీల్లో ఎలాంటి బిల్లులు లేకుండా వాటర్ సప్లయ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అర్హులైన వారికి అందడం లేదు. ఇప్పటికీ చాలా ఏరియాల్లో నీటి బిల్లులు వస్తున్నాయి. ప్రతి నెలా వాటర్ బిల్లులను ఇస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయా కాలనీలు, బస్తీల్లోని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో 1,476 మురికి వాడలున్నాయి. అనధికారికంగా మరో 200 వరకు ఉన్నట్లు అంచనా. వీటిల్లో దాదాపు 2 లక్షల కుటుంబాలు ఉంటున్నాయి. బేగంపేటలోని జేజే హౌసింగ్ కాలనీ, బర్తన్ కాపౌండ్, నల్లగుట్టలోని గైదిన్ బాగ్, బాగ్ లింగంపల్లి, రహమత్‌నగర్‌లోని ఓంనగర్ స్లమ్ ఏరియాల్లోని జనాలకు వాటర్ బోర్డు అధికారులు నేటికీ బిల్లులు ఇస్తున్నారు. కొన్ని బస్తీల్లో ఫ్రీ వాటర్ సప్లయ్ అవుతుండగా, మరికొందరికి బిల్లులు వస్తున్నాయి. బేగంపేటలోని జవహర్ జనతా కాలనీలో కొంతమందికి డొమెస్టిక్ స్లమ్ పేరుతో జీవో బిల్లులు వస్తుండగా, ఇంకొందరికి డొమెస్టిక్ పేరుతో బిల్లులు వస్తున్నాయి. తాము కూడా అదే స్లమ్ లో ఉంటున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బిల్లులు వస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆధార్ లింక్ టైమ్‌లోనే మిస్టేక్
సిటీలో నెలకు 20 వేల లీటర్ల ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అందించడానికి 2020 డిసెంబర్ లో ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. ప్రతి వినియోగదారుడు కన్జ్యూమర్ అకౌంట్‌నంబర్(క్యాన్) ని తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలని చెప్పారు. బస్తీలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వాటర్ మీటర్ ఉండటంతో పాటు, క్యాన్ నంబర్ తో వారి ఆధార్ కనెక్షన్ లింక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. స్లమ్స్ లో కొందరికి అప్పటికే కనెక్షన్లు ఉండగా.. వాటిని డొమెస్టిక్ స్లమ్ కనెక్షన్లుగా గుర్తించి ఆధార్ లింక్ ప్రాసెస్ ను పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కానీ ఈ ప్రాసెస్ సరిగా జరగకపోవడం వల్లే చాలా స్లమ్ ఏరియాల్లోని కనెక్షన్లకు వాటర్ బిల్లులు వస్తున్నాయి. స్లమ్ ఏరియాల్లో దాదాపు 2 లక్షల కుటుంబాలు ఫ్రీ వాటర్ పొందే అవకాశముందని అప్పట్లో చెప్పినా.. అది సరిగా అమలు కావట్లేదు.
వేర్వేరుగా బిల్లులు
స్లమ్స్ లో ఉంటున్న వారికి మీటర్లు అవసరం లేదని బిల్లులు ఇస్తున్నారు. ఒకప్పుడు ఉన్న మీటర్లకు కూడా బిల్లులు ఇస్తున్నారు. స్లమ్స్ గా గుర్తించిన ప్రాంతాల్లో బిల్లులు వస్తుండటంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే మురికివాడల్లో కొంతమందికి డొమెస్టిక్ స్లమ్ పేరుతో జీరో బిల్లు వస్తుండగా, మరి కొందరికి డబ్బులు చెల్లించాలంటూ బిల్లులు అందిస్తున్నారు. దీంతో తమకు మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. స్లమ్స్ లో ఉన్నా వారికి ఫ్రీగా నీటిని ఇస్తున్నామని ఓ వైపు మంత్రులు చెప్తుంటే అధికారులు మాత్రం తమ వద్దకు వచ్చి బిల్లులు చెల్లించాలంటున్నారన్నారు.బస్తీ పేదలకు ఉచిత నీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అధికారుల తీరుతో అమలు కావడం లేదంటున్నారు. బస్తీల్లో బిల్లులు వస్తున్న వాళ్లు ఎవరైనా తమ దృష్టికి తీసుకురావాలని వాటర్ బోర్డ్ అధికారులు సూచిస్తున్నారు. బిల్లులో డొమెస్టిక్ స్లమ్ అని వస్తే వారికి జీరో బిల్లులు వస్తాయని, అలా లేని వారికి బిల్లులు వస్తున్నాయని చెప్తున్నారు. కేటగిరి మార్చుకునేందుకు తమను సంప్రదించాలంటున్నారు.
అందరినీ ఒకేలా చూడాలె
స్లమ్స్‌లో ఉంటున్న వారందరినీ సమానంగా చూడాలె. కొందరికి బిల్లులు ఇవ్వడం, మరికొందరికి ఫ్రీగా వాటర్ సప్లయ్ చేయడం ఎంతవరకు న్యాయం? మంత్రులు ఇచ్చిన హామీ కొంతమందికే వర్తిస్తదా? అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయం పట్టించుకోవడంలేదు. మా కాలనీలో ఉండే అందరికి డొమెస్టిక్ స్లమ్ కింద మార్చి బిల్లులు రాకుండా చూడాలె.
– నమ్రత, జేజే కాలనీ, బేగంపేట