
నాబార్డ్ విధులు
అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం సిఫారసులపై 1956లో స్థిరీకరణ నిధి, దీర్ఘకాల కార్యకలాపాల నిధి అనే రెండు నిధులు ఏర్పడ్డాయి. స్థిరీకరణ నిధి స్వల్ప, మధ్యకాలిక రుణాలు ఇవ్వడానికి, దీర్ఘకాల కార్యకలాపాల నిధి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి (రాష్ట్ర ప్రభుత్వాలకు సహకార సంస్థల వాటా కొనుగోలు చేయడానికి, రాష్ట్ర సహకార బ్యాంకులు భూమి తనఖా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి) ఉద్దేశించినవి.
1963లో అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏఆర్డీసీ) ఏర్పడింది. 1979లో శివరామన్ అధ్యక్షతన సీఆర్ఏఎఫ్ఐసీఏఆర్డీ( కమిటీ టూ రివ్యూ అరెంట్‌మెంట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇన్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధిలో ఒక అపెక్స్ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఫలితంగా 1982 జూలై 12 నాబార్డ్ ఏర్పాటైంది. ఇది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. గతంలో ఉన్న రెండు నిధులు, ఏఆర్డీసీ నాబార్డులో విలీనమైంది. గ్రామీణ పరపతికి నాబార్డ్ అపెక్స్ బ్యాంక్. నాబార్డుకు కేంద్రం, ఆర్బీఐలు 50: 50 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి.
- గ్రామాల్లో వివిధ ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధి కోసం చిన్న, కుటీర, గ్రామీణ పరిశ్రమలు, చేతి పనుల పరిశ్రమలు మొదలైన వాటి పెట్టుబడి కోసం రీ ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తుంది.
- సహకార పరపతి సంస్థలకు వాటా మూలధనం సమకూర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 20 సంవత్సరాల కాలపరిమితితో దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది.
- ఆర్ఆర్బీలకు, వాణిజ్య బ్యాంకులకు, సహకార పరపతి సంఘాలకు, ఎస్సీఏఆర్డీబీలకు రీ ఫైనాన్స్ సమకూర్చుతుంది.
- గ్రామీణాభివృద్ధి పరిశోధనకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.
- వ్యవసాయ గ్రామీణ అభివృద్ధితో సంబంధం ఉన్న కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ సంస్థకైనా రుణాలు లేదా వాటా మూలధనం సమకూర్చుతుంది.
- కేంద్ర, రాష్ట్ర విత్త సంస్థలు, ఆర్బీఐ, జాతీయ స్థాయి సంస్థల కార్యకలాపాలను సమన్వయపరుస్తుంది.
- ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందించే ప్రాజెక్టులకు మానిటరింగ్, మూల్యంకనం చేస్తుంది.
ఇది ప్రత్యక్షంగా ఎవరికీ రుణాలు ఇవ్వదు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం
1998, ఆగస్టులో గుప్తా కమిటీ సిఫారసులపై రైతులకు స్వల్పకాలిక రుణ అవసరాలు తీర్చేందుకు ప్రవేశపెట్టారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మొదలైన వ్యవసాయ ఉత్పాదకాలు వెంటనే కొనుగోలు చేయడానికి, రైతులు ఉత్పత్తి అవసరాలకు నగదును ఉపసంహరించడానికి 1998లో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)ల పథకాన్ని ప్రవేశపెట్టింది. 2004లో వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయేతర కార్యకలాపాల్లో పెట్టుబడి అవసరాలకు దీనిని విస్తరించారు. 2020లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సవరించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించారు. దీని ఉద్దేశం సాగు రైతులకు సింగిల్ విండో ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తగినంత, సకాలంలో రుణ మద్దతును అందించడం.
- ఏటీఎం సౌకర్యం ఉన్న రూపే కార్డును జారీ చేస్తారు. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ప్రారంభించింది.
- 2004 నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయేతర కార్యకలాపాల్లో పెట్టుబడి పరపతి అవసరాలకు విస్తరింపజేశారు. ఉత్పత్తి అనంతరం వ్యయాలు, ఉత్పత్తి మార్కెటింగ్ రుణాలు, రైతు గృహ వినియోగ అవసరాలు, వ్యవసాయ ఆస్తుల నిర్వహణ అవసరాలకు రుణాలిస్తారు.
- కిసాన్ క్రెడిట్ కార్డును ఐదు సంవత్సరాలకు జారీ చేస్తారు.
- భూమి అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, వ్యవసాయ పరికరాల కొనుగోలును టర్మ్‌లోను ఇస్తారు. దీనిని ఐదు సంవత్సరాల్లో లేదా బ్యాంక్ నిబంధనలపై ఆధారపడి తీర్చవచ్చు.
- స్వల్పకాల, దీర్ఘకాల రుణ వడ్డీ రేట్లు వేర్వేరుగా ఉంటాయి. స్వల్పకాలిక పంట రుణం రూ. 3 లక్షల వరకు ఇస్తారు. రూ.1.60 లక్షల వరకు హామీ లేని రుణాలిస్తారు.
- ఉపాంత రైతులకు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు రుణం ఇస్తారు.
కార్డుకు సంబంధించిన సెక్యూరిటీ, వడ్డీరేటు మొదలైన వాటిని ఆర్బీఐ నిర్వహిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే చెల్లింపుకాలం పెంచుకోవడానికి, పరపతి పరివర్తనకు అవకాశం ఉంటుంది. అయితే, ఈశాన్య భారతదేశంలో ఇది అంత ఆశాజనకంగా అమలు కాలేదు. మరోవైపు సహకార సంఘాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి అంత మంచిగా లేదు. కాబట్టి రైతులకు రుణాలు అందించడంలో ఇది గణనీయమైన ప్రగతిని సాధించడం లేదు.
– 2019 మార్చి నాటికి 17.89 కోట్ల కేసీసీలు జారీ చేశారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు అందాయి.
అర్హత
– యజమానులుగా ఉన్న వ్యక్తిగత రైతులు.
– కౌలు రైతులు, షేర్ క్రాపర్లు.
– రైతులు, కౌలుదారులు, పంట వాటాదారులతో కూడిన స్వయం సహాయక బృందాలు.
– పశుపోషణలో పాల్గొనేవారు, చేపలు రైతులు, మహిళా సంఘాలు.
– పౌల్ట్రీ రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారులు.
– డెయిరీ రైతులు, షెడ్లు కలిగి ఉన్న లీజుకు లేదా అద్దెకు తీసుకున్న రైతులు.
మైక్రో ఫైనాన్స్: పేదవారితో బ్యాంకింగ్ అనే నినాదంతో సూక్ష్మ విత్తం ప్రాచుర్యం పొందింది. రుణ మంజూరు వ్యయాన్ని తగ్గించడం, రుణాన్ని సమర్థవంతంగా వసూలు చేయడ దీని లక్ష్యం. నాబార్డ్, స్వయం సహాయక బృందాలు, బ్యాంకుల అనుసంధానం ద్వారా ఈ విధానాన్ని అధికంగా ప్రోత్సహిస్తుంది. సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఆస్తులను హామీగా కోరడం, విపరీత కాలయాపన, రుణ మంజూరు వ్యయం అధికంగా ఉండటం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా పేదవారికి రుణాలు చేరడం లేదు.
బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ అనే ఆర్థికవేత్త బ్యాంకులే పేదవాని వద్దకు వెళ్లి రుణాలందించే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇదే గ్రామీణ బ్యాంకు నమూనాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో ప్రభుత్వే తర సంస్థలు(ఎన్జీవోలు), స్వయం సహాయక బృందాలు, పరపతి సంఘాలు పాల్గొని రుణాలు ఇస్తాయి. మన దేశంలో నాబార్డ్ దీనిని బాగా ప్రోత్సహిస్తున్నది. ఎలాంటి హామీ లేకుండా రూ.25,000ల వరకు పేదలకు స్వయం ఉపాధి ప్రాజె క్టులకు రుణాలు ఇస్తాయి. దీనివల్ల పేదవారి ఆర్థిక సాధికారిత మెరుగుపడుతుంది. ఇవి వ్యవస్థీకృతరంగంలో సూక్ష్మ విత్తాన్ని అందించడానికి దోహదపడతాయి.
ఆర్ఐడీఎఫ్: గ్రామీణ అవస్థాపన సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 1995–96 సంవత్సరంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌ను నాబార్డులో ఏర్పాటు చేశారు. దీని కింద రాష్ట్రాలకు సహాయం అందిస్తారు. ఆర్ఐడీఎఫ్ కింద నీటిపారుదల ప్రాజెక్టులు, వాటర్‌షెడ్ మేనేజ్మెంట్, రూరల్ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రుణాలు అందిస్తారు.
రుణ విస్తరణ: నాబార్డు స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులకు స్వల్పకాలిక పరపతిని అందిస్తుంది. (పంటల మార్కెటింగ్, సహకార చేనేతకారుల కార్యకలాపాలకు, పీఏసీఎస్‌ల ద్వారా చేతివృత్తి దారులకు) సహకార సంస్థల మూలధనం అందిం చేందుకు దీర్ఘకాల రుణ సదుపాయం ఇస్తుంది.