
- ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి మోసం
- రా మెటీరియల్ తెప్పిస్తానని మరొకరి వసూళ్లు
- మొత్తంగా రూ.12 కోట్ల వరకు కుచ్చుటోపీ
- లబోదిబోమంటున్న బాధితులు
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని మినీ టెక్స్‌టైల్‌పార్క్ ప్లాట్‌నంబర్289లో లక్ష్మీదేవి టెక్స్టైల్స్ఇండస్ట్రీ ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ ఏర్పాటుకు షెడ్నిర్మించేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. షెడ్డుతోపాటు అందులో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి.. 2019 మార్చిలో కాంట్రాక్టర్ పనులు స్టార్ట్ చేశాడు. షెడ్చుట్టూ కాంపౌండ్, గేట్, ఫ్లోర్, ఆఫీస్‌రూమ్, గెస్ట్ రూమ్, బాత్ రూమ్స్, ఫర్నిచర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం షెడ్డు వరకు పనులు పూర్తి చేసి వదిలేశాడు. యూనిట్ ఏర్పాటుకు రూ.45 లక్షలు కాగా.. అందులో కొన్ని ఫండ్స్అసలు లబ్ధిదారుల సంతకాలతో, మిగతా కొన్ని ఫండ్స్ ఫోర్జరీ డాక్యుమెంట్స్బ్యాంకులో సబ్మిట్ చేసి డ్రా చేసుకున్నాడు. సంబంధిత లోన్ అమౌంట్ కట్టాల్సిందిగా లబ్ధిదారుడు లక్ష్మీనారాయణకు బ్యాంక్ నుంచి ఫోన్లు వస్తుండటంతో కంగుతిన్నాడు.
హనుమకొండ/కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో ఏర్పాటైన మినీ టెక్స్‌టైల్‌పార్కులో కొందరు కాంట్రాక్టర్లు లబ్ధిదారులకు కుచ్చుటోపి పెట్టారు. పవర్లూమ్ క్లస్టర్ లో షెడ్లు, మౌలిక వసతులు కల్పించడంతో పాటు ముడిసరుకు తెప్పిస్తామని రూ. 12 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించారు. ఇందులో సివిల్ వర్క్స్చేయాల్సిన కాంట్రాక్టరేమో పనులను అసంపూర్తిగా వదిలేయడమే కాకుండా ఫోర్జరీ సంతకాలతో నిధులు డ్రా చేసుకు వెళ్లిపోగా.. రా మెటీరియల్ తెప్పిస్తానన్న కాంట్రాక్టర్ పత్తా లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇండస్ట్రీ ఏర్పాటుతో ఆర్థికంగా డెవలప్ అవుదామనుకుంటే బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ల కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఎంఎస్ఎంఈ కింద ఏర్పాటు
తెలంగాణలో టెక్స్ టైల్ఇండస్ట్రీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఎంఎస్ఎంఈ రిఫరెన్స్‌తో సీజీటీఎంఎస్ఈ(క్రెడిట్గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్) కింద చేనేత కార్మికులకు పవర్లూమ్ ఇండస్ట్రీలు మంజూరు చేసింది. దీంతో కొంతమంది చేనేత కార్మికులు కాకతీయ టెక్స్టైల్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ లిమిటెడ్ పేరున సొసైటీ ఏర్పాటు చేసుకోగా.. ఆయా ఇండస్ట్రీల ఏర్పాటుకు తెలంగాణ స్టేట్ఇండస్ట్రియల్ఇన్ ఫ్రాస్ట్రక్షర్కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో మడికొండలోని దాదాపు 60 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో మొత్తం 300 యూనిట్ల వరకు మంజూరు కాగా.. ఒక్కో యూనిట్ కు ఇండస్ట్రీని బట్టి 550 గజాల వరకు ల్యాండ్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లబ్ధిదారులు నామినల్ రుసుం చెల్లించారు. తరువాత కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో అక్కడ రోడ్లు, డ్రైనేజీలు తదితర కనీస అవసరాలను డెవలప్ చేసింది. ఒక్కో యూనిట్ కు రూ.92.5 లక్షల వరకు లోన్ సదుపాయం కల్పిస్తుండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వరకు సబ్సిడీ కూడా ఇస్తుండటంతో విడతల వారీగా 120 మంది లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.
లబ్ధిదారులకు తెలియకుండానే విత్ డ్రా
120 యూనిట్లలో 43 ఇండస్ట్రీలకు సంబంధించిన లబ్ధిదారులు బిల్డింగ్ సదుపాయం కోసం ఓ బిల్డర్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. సిమెంట్ ఇటుకలతో షెడ్డు ఏర్పాటు చేసి చుట్టూ కాంపౌండ్, గేటు, కలర్డ్రూఫ్, ఫ్లోర్, విండోస్, షట్టర్స్, సైడ్ షట్టర్స్, మోటార్సెట్, ఆఫీస్ రూమ్, రెస్ట్ రూమ్, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు చేయాలి. రూ. 22 లక్షల అంచనాతో పనులు స్టార్ట్ చేసిన కాంట్రాక్టర్ తర్వాత గిట్టుబాటు కావడం లేదని రూ.45 లక్షల వరకు బిల్లు పెంచుకుంటూ వచ్చాడు. 2019 మార్చిలో వర్క్స్ స్టార్ట్‌చేసి పూర్తి చేయకుండానే చేతులెత్తేశాడు. పనులు మధ్యలోనే వదిలేసి లబ్ధిదారుల సంతకాలు ఉన్న జిరాక్స్పేపర్లు పెట్టి 43 యూనిట్లలో ఒక్కో యూనిట్‌కు సంబంధించిన రూ.45 లక్షల బిల్లులు విత్ డ్రా చేశాడు. వాస్తవానికి కాంట్రాక్టర్ చేసిన పనులకు రూ.30 లక్షలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉండగా.. మిగతా రూ.15 లక్షలు అదనంగా విడిపించుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ మొత్తాన్ని విడతలవారీగా చెల్లించే క్రమంలో బ్యాంకు అధికారులు ఫీల్డ్ విజిట్‌చేసి లబ్ధిదారుల సంతకాలు పరిశీలించిన తరువాత అమౌంట్‌ను కాంట్రాక్టర్ కు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అదంతా ఏమీ జరగకుండానే ఫండ్స్ రిలీజ్ చేయడం పట్ల బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రా మెటీరియల్ ఇస్తామని మరొకరు..
పవర్లూమ్ ఇండస్ట్రీలకు ముడి సరుకు సప్లై చేస్తామని చెప్పి మరో కాంట్రాక్టర్ 2021లో 33 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మొత్తంగా రూ.6 కోట్ల వరకు వసూలు చేశాడు. వారం, పది రోజుల్లో ముడి సరుకు అందిస్తానని చెప్పి ముఖం చాటేశాడు. దీంతో అప్పటినుంచి ఆయా ఇండస్ట్రీలలో ప్రొడక్టివిటీ ఆగిపోయింది. ఇద్దరి చేతుల్లో మోసపోయిన బాధితులు కొద్దిరోజుల కిందట స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పవర్లూమ్ క్లస్టర్లో జరుగుతున్న మోసాలపై చర్యలు చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పని ఆగిపోయింది
టెక్స్టైల్ఇండస్ట్రీలకు ముడి సరుకు ఇస్తమని ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. కానీ ఇంతవరకు సప్లై చేయలేదు. దీంతో పని మొత్తం ఆగిపోయింది. అప్పులు తీసుకొచ్చి బ్యాంకు లోన్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో పాటు మరో ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేశారు. ఇందులో బ్యాంకు సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తగిన చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి.
– బాసాని సుభాష్, అరవింద్పవర్ లూమ్స్
న్యాయం చేయాలి
దాదాపు రూ.15 లక్షలకు సంబంధించిన పనులు చేయకుండానే చేసినట్టు చూపి కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నాడు. ఆ అమౌంట్ విత్ డ్రా కోసం మేం సంతకాలు పెట్టలేదు. మొదట్లో సంతకం పెట్టిన కాపీలను జిరాక్స్ తీసి వాటి ద్వారా డబ్బులు తీసుకున్నాడు. జిరాక్స్ సంతకాలను చూసి బ్యాంకు అధికారులు డబ్బులు ఎలా రిలీజ్ చేశారో అర్థం కావడం లేదు. కాంట్రాక్టర్లు, బ్యాంక్ సిబ్బంది తీరు వల్ల మళ్లీ అప్పుల పాలు కావాల్సి వస్తోంది. దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి.
– పగడాల లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి టెక్స్ టైల్స్