- ఏడు నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్
- కొన్ని దవాఖానలకే డెవలప్మెంట్ నిధులు
- మూడు నెలలుగా శానిటేషన్ వర్కర్లకు ఉద్యోగులియ్యలే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని దవాఖానలకు నెలల తరబడి డెవలప్మెంట్ ఫండ్స్ మంజూరు చేయడంలేదు. చాలా హాస్పిటల్స్ లో ఏడెనిమిది నెలల నుంచి డైట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో రోగులకు సరైన మెనూ అందడంలేదు. హాస్పిటల్స్ నిర్వహణ కష్టమవుతోంది. దీనికి తోడు శానిటేషన్ వర్కర్లు, ఔట్ సోర్సింగ్ఉద్యోగులకు కూడా మూడు నెల నుంచి జీతాలు ఇవ్వడంలేదు. దీంతో చాలా చోట్ల ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది.
డీజిల్‌కూ పైసల్లేవు
తెలంగాణలో సర్కారు దవాఖానల్లో కార్పోరేట్ స్థాయి వైద్యసేవలు అందుతున్నాయని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. కానీ, చాలా హాస్పిటల్స్‌లో కనీస సదుపాయాలు కూడా ఉండడంలేదు. ప్రతి హాస్పిటల్‌కు ప్రభుత్వం ఏడాదికి రూ. 5 లక్షల వరకు డెవలప్మెంట్ ఫండ్ఇవ్వాల్సిఉంటుంది. జనరేటర్కోసం డీజిల్, బల్బులు, శానిటేషన్ అవసరాలకు ఈ నిధులు వాడుతుంటారు. కొంతకాలంగా కొన్ని హాస్పిటల్స్‌కు మాత్రమే ఫండ్స్ మంజూరు చేస్తున్నారు.
మారుమూల ప్రాంతాలకు చెందిన దవాఖానలకు ఈ ఫండ్స్ ఎప్పుడో గాని రావడంలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ హాస్పిటల్స్‌కు మాత్రం డెవలప్మెంట్ ఫండ్స్వచ్చాయి. ఇల్లెందు, బూర్గంపహడ్, మణుగూరు, అశ్వారావుపేటలకు ఫండ్స్ రాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం ఫండ్స్రిలీజ్ చేయలేదు. దీంతో ఏ చిన్న అవసరమొచ్చినా డ్రాయింగ్ ఆఫీసర్లు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సివస్తోంది.
జనరేటర్లో డీజిల్‌లేక సర్జరీల సమయంలో ఇల్లెందు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. కరెంట్ పోతే జనరేటర్ నడవక డయాలసిస్ రోగులు అవస్థలు పడుతున్నారు.
ఫుడ్‌కు కష్టాలే
తెలంగాణవ్యాప్తంగా చాలా దవాఖానల్లో డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ, అశ్వారావుపేట, బూర్గంపహడ్, మణుగూరు హాస్పిటల్స్‌లో ఏడెనిమిది నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క పాల్వంచ హాస్పిటల్లోనే రూ. 7లక్షలకు పైగా డైట్ బిల్లులు రావాల్సి ఉంది.
ఇటీవలి కాలంలో జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇటు రోగుల సంఖ్య పెరగడం, అటు బిల్లులు రాకపోవడంతో ఫుడ్సప్లయ్చేయడానికి కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్తున్నారు. బకాయిలు పేరుకుపోవడంతో చాలాచోట్ల రోగులకు క్వాలిటీ లేని ఫుడ్ ఇస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి.
సమ్మెకు సిద్ధమవుతున్న శానిటేషన్ వర్కర్లు
వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడంలేదు. నెలనెలా జీతాలు రాక నానా అవస్థల పడుతున్నామని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సర్కారు నుంచి సానుకూల స్పందన రాలేదని, కుటుంబాలను పోషించుకునేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.
వెంటనే జీతాలియ్యకపోతే సమ్మె చేయాలని కార్మికులు నిర్ణయానికి వచ్చారు. భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్‌కు చెందిన శానిటేషన్ వర్కర్స్ సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. కార్మికులు సమ్మెకు దిగితే వైద్యసేవలమీద తీవ్ర ప్రభావం పడనుంది.