హైదరాబాద్/పరిగి, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి రుజువైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత బడ్జెట్ మాదిరిగానే ఈసారి కూడా కేంద్రం తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. ‘‘ఎన్నికలున్న బిహార్‌కు బంగారు పళ్లెంలో వడ్డించిన కేంద్రం.. తెలంగాణకు అన్యాయం చేసింది. ఐఐటీ, ఐఐఎం, ఐకార్, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఏదీ ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు అన్యాయం చేయడమే.
విభజన హామీలను నెరవేర్చకపోవడం అత్యంత దుర్మార్గం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు అమలు చేయని బీజేపీని ఇకపై ప్రజలు నమ్మరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సాయం అందిస్తూ తెలంగాణకు మొండి చెయ్యి చూపించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపించినా.. 16 మంది కలిసి తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా’’ అని కేసీఆర్ విమర్శించారు.
100% రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్త..
రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా100 శాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చించడానికైనా సిద్ధమన్నారు. వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండలం దాస్య నాయక్ తండాలో శనివారం నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో కేటీఆర్ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.