రాష్ట్ర బడ్జెట్​లో స్కూల్​ చదువును పట్టించుకోవట్లే

తెలంగాణ అభివృద్ధి గురించి ప్రభుత్వం ఎన్ని కబుర్లు చెప్పినా, రాష్ట్రంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నదనేది వాస్తవం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 63 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల 30 వేల కోట్లకు పెరిగింది. కానీ స్కూల్ విద్యకు కేటాయింపులు మాత్రం ప్రతి ఏటా తగ్గుతూ పోతున్నాయి. 2014–15లో రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 63 వేల కోట్లు కాగా, స్కూల్​ విద్యకు బడ్జెట్ లో 9.3% కేటాయించారు. 2021–22 సంవత్సరం వచ్చేసరికి బడ్జెట్ రూ.2 లక్షల 30 వేల కోట్లకు పెరిగితే స్కూల్​ విద్యకు 5.1% మాత్రమే కేటాయించారు. అలాగే రాష్ట్ర స్థూల ఆదాయం(జీడీపీ) నుంచి స్కూల్  విద్యకు 1.01% మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు గణాంకాల ద్వారా అర్థమవుతోంది. 2014–15 నుంచి 2021–22 వరకు ఎనిమిదేండ్లలో స్కూల్  విద్యకు సగటు కేటాయింపులు 6.4% మాత్రమే. విద్యకు నిపుణులు సూచించిన 20%తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

స్కూల్​ విద్యకు బడ్జెట్ కేటాయించడంలో శ్రద్ధ పెట్టకపోవడంతో ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని విద్యా శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. స్కూల్​ విద్యకు సంబంధించి గత ఎనిమిది సంవత్సరాల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కానీ, మౌలిక వసతులకు అదనపు నిధులు కానీ, టీచర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకాలుగానీ చేపట్టలేదు. 2021–22 బడ్జెట్ లో రెండు సంవత్సరాలకు గానూ రూ.4,000 వేల కోట్లు స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. కానీ ఆ నిధులను ఖర్చు చేసే ప్రణాళికలు మాత్రం వేయలేదు.

58 శాతం మంది ప్రైవేటులోనే..

రాష్ట్రంలో ఉన్న 40,898 బడుల్లో ఒకటి నుంచి పదో క్లాస్ వరకు 59,26,253 మంది పిల్లలు చదువుతుండగా ఇందులో 34,37,752 మంది 10,500కుపైగా ఉన్న ప్రైవేటు బడుల్లోనే చదువుతున్నారు. అంటే దాదాపు 58% మంది పిల్లలు ప్రైవేటు బడుల్లోనే చదువుకుంటున్నారు. బడుల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణం, టీచర్ల నియామకం నాణ్యమైన మధ్యాహ్న భోజనం, రవాణా సౌకర్యం, టీచర్లకు విద్యా సామర్థ్యాలను అందించడానికి శిక్షణ మొదలైన అంశాలకు ప్రణాళికాబద్ధంగా సరిపడా నిధులు కేటాయిస్తే ఇంత భారీ సంఖ్యలో పిల్లలు ప్రైవేటు స్కూల్స్ కు వెళ్లేవారు కాదు. ప్రభుత్వ విద్యను పటిష్ట పరచడానికి రాష్ట్ర సర్కారు బాధ్యత తీసుకోవాలి. మూడు విడతల్లో అమలు చేయాలని వేసిన “మన ఊరు–మన బడి” లాంటి పథకాల ద్వారా సమస్య పరిష్కారం కాదు. పైపై ప్రతిపాదనలు కాకుండా సమగ్రమైన ప్రణాళికను రూపొందించాలి. 

మౌలిక వసతులు పెంచాలె

రాష్ట్ర విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్​లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలి. ముఖ్యంగా 28,142 ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.9,845 కోట్లు అవసరమవుతాయి. స్కూల్స్ లో గదులు, లైబ్రరీలు, ల్యాబ్స్​ నిర్మాణం కోసం రూ.4,480 కోట్లు అవసరం. 445 రెసిడెన్షియల్ స్కూల్స్ లో మౌలిక వసతుల నిర్మాణం కోసం రూ.7,120 కోట్లు అవసరమవుతాయి. మొత్తంగా రాష్ట్రంలోని స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.21,445 కోట్లు కేటాయించాల్సి ఉందని సోషల్ డెమోక్రటిక్ ఫోరం(ఎస్డీఎఫ్) అంచనా వేసింది. విద్యా రంగం బాగుపడాలంటే తగిన మానవ వనరులు అందుబాటులో ఉండడం అత్యంత కీలకం. ముఖ్యంగా చదువు చెప్పే టీచర్లు అవసరం. ప్రభుత్వ స్కూల్స్ లో ప్రస్తుతం ఉన్న పిల్లల నమోదుతో లెక్కించడం వలన టీచర్ల నియామకంలో లోపాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా టీచర్లు లేని కారణంగా సరిపడా భోదన జరగడం లేదని పిల్లలు ప్రైవేటు బడుల బాట పడుతున్నారు. ఒకవైపు టీచర్లను ఇవ్వని కారణంగా పిల్లలు తక్కువ అవుతుంటే, ఆ లెక్కలను పరిగణనలోకి తీసుకుని టీచర్ - స్టూడెంట్ నిష్పత్తిని లెక్కించడం అన్యాయం. విద్యా హక్కు చట్టం సిఫారసుతో పోల్చినప్పుడు రాష్ట్రంలో టీచర్–స్టూడెంట్ నిష్పత్తి 1:20తో మెరుగ్గా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. పిల్లలతో నిమిత్తం లేకుండా ప్రతి స్కూల్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, టీచర్లను నియమించి పిల్లలను ప్రభుత్వ బడికి రప్పించాలి. అంతే కానీ పిల్లలు బడి నుంచి వెళ్లిపోయారనే పేరున  టీచర్లను నియమించకుండా ఉండడం వల్ల ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు విద్యా సామర్థ్యాలు అందుకోలేక చదువు నుంచి దూరం అవుతున్నారు.

టీచర్లు సరిపడా లేరు

రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 18,240 ప్రైమరీ స్కూల్స్(1 నుంచి 5వ క్లాస్ వరకు) ఉన్నాయి. ఒక్కో స్కూల్​లో కనీసం ఐదుగురు టీచర్ల అవసరం ఉంది. కనీసం ప్రతి గ్రామ పంచాయతీలోనైనా ఐదుగురు టీచర్లను నియమించాలి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి ఐదుగురు చొప్పున 63,845 మంది టీచర్లు అవసరం. కానీ, ప్రస్తుతం పని చేస్తున్నవారు 41,587 మందే(డైస్:2019-‌‌–20 ప్రకారం). అంటే అదనంగా 22,268 టీచర్లు అవసరమన్న మాట. ఇక రాష్ట్రంలో 3,164 అప్పర్​ ప్రైమరీ స్కూల్స్(1 నుంచి 7వ క్లాస్​ వరకు) ఉన్నాయి. ప్రతి స్కూల్ కు ప్రైమరీ స్థాయిలో ఐదుగురు టీచర్లు.. మరో ఇద్దరు పండిట్స్, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు మొత్తం 9 మంది టీచర్లు అవసరం. అంటే 3,164 స్కూల్స్ కు 9 మంది చొప్పున 28,476 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం పని చేస్తున్న వారు 17,203 మందే. మరో 11,273 మంది టీచర్లను నియమించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,661 హైస్కూల్స్(6 నుంచి 10వ క్లాస్ వరకు) ఉన్నాయి. వీటిలో 46,248 మంది టీచర్లు పని చేస్తున్నారు. నిజానికి ప్రతి స్కూల్ కు ఒక హెడ్ మాస్టర్, ఒక స్పోర్ట్స్ టీచర్, ఏడుగురు సబ్జెక్ట్  టీచర్లు ఇలా మొత్తం 9 మంది అవసరం ఉంటుంది. 4,661 స్కూల్స్ కు 41,949 మంది టీచర్లు ఉండాలి. కొన్ని స్కూల్స్ లో 250 ఆ పైన పిల్లలు ఉన్నట్లయితే అదనంగా నలుగురు, 250 నుంచి 500 అయితే అదనంగా ఏడుగురు టీచర్ల అవసరం ఉంటుంది. ఈ పద్ధతిలో పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి బడ్జెట్ లో నిధులను కేటాయించాలి.

పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలె

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కలిపి దాదాపు 73.6% మంది ఇంగ్లిష్​ మీడియంలో చదువుతున్నారు. ఏటా ఈ మీడియంలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల శిక్షణ పొందిన ఇంగ్లిష్ టీచర్ల ఆవశ్యకత చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడులను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చుతున్నట్లు నిర్ణయం తీసుకున్న కారణంగా కనీసం క్లస్టర్ కు ఒక ఇంగ్లిష్ రిసోర్స్  టీచర్ ను నియమించాలి. 594 మండలాల్లో మండలానికి 3 క్లస్టర్స్ చొప్పున కనీసం 1,782 మంది శిక్షణ పొందిన టీచర్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో ఎన్ని నిధులు ఖర్చు చేసినా, ఎన్ని నియామకాలు చేసినా పర్యవేక్షణ లేకపోతే నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరే. 33 జిల్లాలకుగాను 10 జిల్లాల్లో మాత్రమే పూర్తి కాలపు జిల్లా విద్యా అధికారులు పని చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో 66 మంది ఉప విద్యాధికారులు అవసరం కాగా నలుగురు మాత్రమే పని చేస్తున్నారు. పూర్తి స్థాయి మండల విద్యా అధికారులు 594 మంది ఉండాల్సి ఉండగా 17 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. 

మధ్యాహ్న భోజనానికి పైసలు పెరగాలె

స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం కోసం 2020 ఏప్రిల్​ 1న కేంద్రం సవరించిన రేట్ల ప్రకారం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తి ప్రకారం ప్రైమరీ స్థాయి స్టూడెంట్లకు రూ.4.97(కేంద్రం రూ.2.98.. రాష్ట్రం రూ.1.99 ), అప్పర్​ ప్రైమరీ స్టూడెంట్లకు రూ.7.45(కేంద్రం రూ.4.47, రాష్ట్రం రూ.2.98) భరిస్తున్నాయి. దీంతోపాటు వంట చేసే వాళ్లకు నెలకు రూ.వెయ్యిని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో కేటాయిస్తున్నారు. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవడం, ఖర్చు చేసిన వివరాలు కేంద్రానికి సకాలంలో అప్పచెప్పకపోవడం, పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా నిధులు పెంచకపోవడం, వంటవాళ్లకు సరైన సమయంలో నిధులు మంజూరు చేయకపోవడంతో మధ్యాహ్న భోజనంలో నాణ్యత చాలా తక్కువగా ఉంటున్నది. చివరగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే సంకల్పం దెబ్బతింటోంది. అందువల్ల మధ్యాహ్న భోజన పథకానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

:: ఆర్.వెంకటరెడ్డి, నేషనల్​ కన్వీనర్, ఎంవీఎఫ్