జగిత్యాల: ధర్మపురి ఆలయ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తానని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. సోమవారం (జనవరి 20) ధర్మపురి పట్టణంలో రూ.15 కోట్ల వ్యయంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి పలు అభివృద్ధి పనులకు ఎంపీ వంశీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.15 కోట్ల టీయుఎఫ్ఐడీసీ నిధులతో ధర్మపురి పట్టణంలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. తలాపున గోదావరి ప్రవహిస్తున్న ధర్మపురి పట్టణంలో నీటిఎద్దడి సమస్య ఉండటం బాధకరమని అన్నారు.
Also Read : రేసు మొనగాడు దీక్షలు చేస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరు
గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు ఉన్న నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయాని విమర్శించారు. అమృత్ పథకం కింద రూ.2 కోట్ల వ్యయంతో తాగునీటి సమస్య కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇచ్చిన హామీలను నేరవేరుస్తున్నామన్నారు. గతంలో ధర్మపురిలో గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు విశాఖ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నామని గుర్తు చేశారు. ధర్మపురి కరకట్ట నిర్మాణం గురించి కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.