సంక్షేమ శాఖలకు ఫండ్స్ ఇస్తలె
కల్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యరు
ఎస్సీ, ఎస్టీ ఫండ్దారి మళ్లింపు
లోన్లు అడిగితే ఇచ్చే దిక్కు లేదు
ఫెడరేషన్లను పట్టించుకునేది లేదు
బడ్జెట్‌లో ఉత్త కేటాయింపులే
రెండేండ్లుగా కార్పొరేషన్లకు చైర్మన్లు లేరు
స్పెషల్ మేనిఫెస్టో అమలు మాటే లేదు
సాయం కోసం లక్షలమంది ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ శాఖలను ప్రభుత్వం గాలికొదిలేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లకు బడ్జెట్‌లో దండిగా నిధులు కేటాయిస్తున్నట్టు చెబుతున్నా.. విడుదల చేసేది మాత్రం అంతంతే. కల్యాణలక్ష్మి సాయం కోసం పెండ్లయిన తర్వాత ఏడాదికిపైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. యూత్‌కు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ లోన్లు ఇచ్చుడే లేదు. బీసీ ఫెడరేషన్లు ఏ యాక్టివిటీ లేక ఖాళీగా ఉంటున్నాయి. కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరగడమే లేదు.
కేటాయింపులు ఇట్ల.. విడుదల చేసేది అట్ల
ఈ ఏడాది బడ్జెట్‌లో ఎస్సీలకు రూ.2,610 కోట్లు, ఎస్టీలకు రూ.2,286 కోట్లు కేటాయించారు. స్పెషల్ డెవప్‌మెంట్ ఫండ్ కింద ఎస్సీలకు రూ. 16,534 కోట్లు, ఎస్టీలకు రూ. 9,711 కోట్లు అలకేట్ చేశారు. బీసీ సంక్షేమానికి రూ. 4,356 కోట్ల కేటాయింపులు చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభంలోనే రాష్ట్రంలో కరోనా కేసులు మొదలయ్యాయి. దీంతో సంక్షేమ శాఖలకు నిధుల విడుదలను ఆపేశారు. ముఖ్యమైన కార్యక్రమాలకు మినహా మిగతావాటికి నిధులు ఇవ్వడం లేదు.
రూ. 50 వేల కోట్లు దారి మళ్లింపు
ఎస్సీ, ఎస్టీలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద చేసిన కేటాయింపుల్లో రూ. 50 వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లించింది. ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఎస్డీఎఫ్ నిధులను మళ్లిస్తూ సబ్ ప్లాన్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ స్పెషల్‌ఫండ్‌కు సంబంధించి 2014 నుంచి 2019 వరకు రూ. 69,479 కోట్లు కేటాయిస్తే.. అందులో రూ. 40,039 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగతా రూ. 29,440 కోట్లను దారి మళ్లించింది. ఎస్టీ స్పెషల్ ఫండ్‌కు 2014 నుంచి 2020 వరకు రూ. 40,801 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ. 19,801 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగతా రూ. 21,000 కోట్లను ఇతర వాటికి వాడింది. ఎస్డీఎఫ్ నిధులను మరుసటి యేడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టుగా పేపర్ల మీదనే ప్రకటించి చేతులు దులుపుకుంటున్నది. నిరుపేద యువతుల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా రూ. 1,00,116ను సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. అయితే.. ఈ సాయం కోసం జనానికి ఎదురుచూపులు తప్పట్లేదు. పెండ్లయిన యేడాది తర్వాత గానీ చెక్కులు అందట్లేదు. బీసీ సంక్షేమ శాఖలో కల్యాణలక్ష్మి పెండింగ్ అప్లికేషన్లు 50 వేలకు పైగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో కలిపి లక్షకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం టైమ్‌కు చెక్కులు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు అప్పులు చేయక తప్పడం లేదు.
లోన్ల కోసం లక్షల అప్లికేషన్లు పెండింగ్
యూత్‌కు స్వయం ఉపాధి కోసం సంక్షేమ శాఖల కింద కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉండగా ఏండ్లకేండ్లుగా ఆ ప్రయత్నం జరగడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ సంక్షేమ శాఖ నుంచి లోన్లను ఒక్క ఏడాదే ఇచ్చి చేతులెత్తేశారు. ఎస్టీ సంక్షేమ శాఖలో స్వయం ఉపాధి పథకం అమలవట్లేదు. ట్రైకార్‌కు యాక్షన్ ప్లాన్ లేక ఏటా జీరో ఇయర్‌గానే మిగిలిపోతున్నది. ఎస్సీ వెల్ఫేర్ నుంచి కూడా రెండేండ్లుగా లోన్లు రావట్లేదు. 5.7 లక్షల మంది బీసీ యూత్ స్వయం ఉపాధి కోసం అప్లయ్చేసుకోగా వారంతా ఎప్పుడు సాయం అందుతుందా అని ఎదురు చూస్తున్నరు. ఎస్సీలకు 2018 వరకు లోన్లు ఇచ్చి తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రకటించి ఊరుకున్నారు. 2 లక్షలకు పైగా ఎస్సీ యూత్ అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఎస్టీ యూత్ లక్ష మందికి పైగా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ 2015––16 సంవత్సరం తీసుకున్న అప్లికేషన్లనే ఇంకా పరిశీలించలేదు.
ఫెడరేషన్లకు ఒక్క పైసా ఇయ్యలె
బీసీ కార్పొరేషన్‌కు అదనంగా చేతి వృత్తులు చేసుకునే కులాల వారి కోసం ప్రభుత్వం ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది. పూసల, శాలివాహన, మేదర, ఉప్పర, వాల్మీకి, రజక, బట్రాజు, కల్లుగీత, విశ్వబ్రాహ్మణ తదితర మొత్తం 11 కుల సమాఖ్యలు ఉన్నాయి. వీళ్లకు మోడ్రన్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇప్పించి వారు పని చేసేందుకు, మిషనరీ కొనుగోలుకు సబ్సిడీపై లోన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటిరెండేండ్లు కొద్దిగా నిధులిచ్చిన ప్రభుత్వం.. తర్వాత చేతులెత్తేసింది. ఏడాది కింద కుమ్మరులు, మేదర, రజకులకు ట్రైనింగ్ ఇప్పించినా.. బడ్జెట్ లేకపోవడంతో ఎక్విప్‌మెంట్ ఇవ్వలేదు. ఇక గిరిజన, ఎస్సీ శాఖల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అంతంతే నడుస్తున్నాయి.
చైర్మన్లను నియమిస్తలేదు
సంక్షేమ కార్పొరేషన్లకు కనీసం చైర్మన్లను కూడా ప్రభుత్వం నియమించడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు రెండేండ్లుగా చైర్మన్ లేరు. యేడాదిన్నర కిందే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కాలం ముగిసింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కాల పరిమితి ముగిసి యేడాది అయింది. ఇట్ల మూడు కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదు.
స్పెషల్ మేనిఫెస్టో మాటే మరిచిన్రు
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీల కోసం స్పెషల్ మేనిఫెస్టో ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేనిఫెస్టో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీల స్వయం ఉపాధితో పాటు వారి ఆవాస ప్రాంతాల అభివృద్ధికి కమిటీ సూచనలు చూసింది. వీటిని సర్కారు పట్టించుకోవట్లేదు.
నిధులు పక్కదారి పట్టిస్తున్నరు
ఎస్సీ, ఎస్టీల స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులను పక్కదారి పట్టిస్తున్నరు. మా సంక్షేమానికి ఇచ్చే పైసలను తీసుకపోయే ప్రాజెక్టుల్లో ఖర్చు చేస్తున్నరు. ఎస్సీ, ఎస్టీలకు రైతుబంధు ఇచ్చెటందుకు కూడా ఈ నిధులనే ఖర్చు చేస్తున్నారు. మిగతా అందరికీ బడ్జెట్ నుంచి ఇచ్చి మాకు ఇట్ల చేసుడేంది.
సంక్షేమంపై సర్కారుకు చిత్తశుద్ధి లేదు.
– ధర్మానాయక్, తెలంగాణ గిరిజన సంఘం నేత
ఏడాది గడుస్తున్నా చెక్కు రాలె..
నా పెండ్లయి యేడాది అయిపోయిం ది. ఇప్పటి దాకా కల్యాణలక్ష్మి చెక్కు రాలేదు. సార్లను అడిగితే బడ్జెట్ రాలేదని అంటున్నరు. ఆన్ లైన్ లో స్టేటస్ చెక్ చేస్తే ప్రాసెస్ లో ఉన్నట్టు చూపిస్తున్నది. మాకు వెంటనే పైసలు వచ్చేటట్టు చూడాలి.
– నిత్య, నల్గొండ
మొత్తం అధ్వాన్నమైంది
రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించిన స్కీంలు సక్కగా అమలు చేస్తలేరు. ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ప్రకృతివనాలు, రైతు వేదికల పేరుతో ఎస్సీల భూములు గుంజుకుంటున్నది. ఉమ్మడి ఏపీలో యేటా స్వయం ఉపాధి లోన్లు వచ్చేవి. ఇప్పుడు డిపార్ట్‌మెంట్ మొత్తం అధ్వాన్నమైంది. బడ్జెట్ లో పైసలు ఖర్చు పెడ్తలేరు.
– స్కైలాబ్ బాబు, కేవీపీఎస్, జనరల్ సెక్రటరీ
For More News..
సర్కార్ శాలరీస్ ఈ నెల వారం లేట్
సిటీలో 1,13,824 రాంగ్ అండ్ ఫేక్ నంబర్ ప్లేట్స్
ఛేజింగ్‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి