కామారెడ్డికి యాదాద్రి, వేములవాడ దేవాలయాల ఫండ్స్.. ఉత్తర్వులు జారీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం కేసీఆర్ పోటీ చేయబోయే  కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు  ఆలయాల అభివృద్ధి కోసం యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాల్లో కలిపి మొత్తం రూ.10 కోట్ల నిధులు ఇవ్వాలని దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున రూ.5 కోట్లు, వేములవాడ ఆలయం తరఫున రూ.5 కోట్లు ఇవ్వాలని ఆలయ ఈవోలకు ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశించారు.  

Also Read :- మరో మూడ్రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఎండోమెంట్​ కమిషర్ జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేములవాడ టౌన్​లో వేర్వేరుగా సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. బీజేపీ అధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్​లో, కాంగ్రెస్​ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ఎదుట సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసిన నిరసన తెలిపారు. 

రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కేసీఆర్​, ఇప్పుడు ఆ దేవుడికే శఠగోపం పెట్టాలని చూస్తున్నాడని, వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని రెండు పార్టీల నాయకులు హెచ్చరించారు.