భద్రాచలం, వెలుగు: భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం ప్రసాద్ స్కీం ద్వారా తొలి దశలో రూ.41,38,07,970 విడుదల చేస్తూ కేంద్ర టూరిజం శాఖ జీఓ జారీ చేసింది. ఈ నిధులతో భద్రాచలంతో పాటు దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయంలో కూడా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నిత్య కల్యాణ మండపం వద్ద ఫ్లోరింగ్‌కు రూ.47 లక్షలు, హనుమాన్ టెంపుల్వద్ద రూ.39 లక్షలు, మెట్లపై రూ.23 లక్షలు, పర్ణశాలలో రూ.11లక్షలతో ఫ్లోరింగ్పనులు చేపట్టనున్నారు. నిత్య కల్యాణ మండపం వద్ద రూఫింగ్కు రూ.1.09 కోట్లు, హనుమాన్ టెంపుల్వద్ద రూఫింగ్కు రూ.1.92 కోట్లు వెచ్చించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం జరిగే మిథిలా స్టేడియంపైన రూ. 1.69 కోట్లతో డిటాచబుల్రూఫ్(అవసరం లేనప్పుడు వాటంతట అవే మూసుకునేలా) పనులు చేపడతారు.
రూ.56 లక్షలతో 10 బ్యాటరీ కార్లను కొనుగోలు చేయనున్నారు. గోదావరి వంతెన సమీపంలోని ఆర్అండ్బీ స్థలంలో రూ.6.94 కోట్లతో భక్తులకు సకల సదుపాయాలతో కాటేజీలు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, పార్కు నిర్మించనున్నారు. రూ.3.51 కోట్లతో వ్రత మండపం నిర్మిస్తారు. గోదావరి వంతెనను దాటి భద్రాచలంలోకి ప్రవేశించగానే భక్తులకు స్వాగతం పలికేలా రూ.2.43 కోట్లతో స్టోన్ఆర్చీ నిర్మిస్తారు. ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ నుంచి రామాలయం వరకు సెంట్రల్ లైటింగ్‌కు రూ.3.89 కోట్లు కేటాయించారు. పర్ణశాలలోని సీతవాగు వద్ద క్యాంటీన్, వెయిటింగ్‌హాల్, బయోటాయిలెట్స్, ఫుట్‌బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.69 కోట్లు ఖర్చు చేయనున్నారు. పర్ణశాలలో సెంట్రల్ లైటింగ్, భక్తులకు సకల వసతులతో కాటేజీ కోసం రూ.4.92 కోట్లు, భద్రాచలం, పర్ణశాలలను అనుసంధానం చేస్తూ సీసీ టీవీల ఏర్పాటుకు రూ.99 లక్షలు, భద్రాచలంలో ప్రసాదాల తయారీ మెషీన్లకు రూ. 69 లక్షలు కేటాయించారు. సీతారామచంద్రస్వామి పోటు(ప్రసాదాల తయారీ కేంద్రం) ఆధునికీకరించనున్నారు. ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలోని చిత్రకూట మండపం వద్ద ప్రసాద్పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నిధులతో ఏడాదిలోపు పనులన్నీ పూర్తి చేయాలని కేంద్ర టూరిజం శాఖ జీవోలో పేర్కొంది. పనులను రాష్ట్ర టూరిజం ఇంజనీరింగ్ విభాగం చేపట్టనుంది.
భద్రత ఏర్పాట్ల పరిశీలన
భద్రాచలంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతను ఓఎస్డీ సాయిమనోహర్, ఏఎస్పీ రోహిత్రాజ్శుక్రవారం తనిఖీ చేశారు. ఆదివాసీ యువతులతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నందున కూనవరం రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాలును పరిశీలించారు. ఐటీసీ గెస్ట్ హౌజ్‌లో రాష్ట్రపతి బస చేస్తుండడంతో ఐటీసీ యాజమాన్యం ఓ నోటీసు జారీ చేసింది. పోలీసులు క్వార్టర్లలో వివరాలు సేకరించేందుకు వస్తారని, వారికి సిబ్బంది సహకరించాలని ఆదేశించింది. బంధువులు, ఫ్రెండ్స్రాకపోకలపై 27, 28 తేదీల్లో ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనుమానితుల వివరాలు తెలియజేయాలని కోరింది. ఐటీసీకి వచ్చే జామాయిల్లారీలు, ట్రాక్టర్లను రెండు రోజుల పాటు రావొద్దని సూచించింది. ఏజెన్సీలోని ఇసుక ర్యాంపులు కూడా రెండు రోజులు మూసివేయాలని పోలీసులు సూచించారు. భద్రాచలం, సారపాకలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.