- రూ.34 కోట్ల నిధులు రిలీజ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: టాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రూ.34 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్పొరేషన్ లో ప్రస్తుతం గీత కార్మికులకు కాటమయ్య కిట్ లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా10 వేల మందికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు సుమారుగా 5 వేల మందికి పంపిణీ చేసింది.
ఒక్కో కిట్ సుమారు రూ.13 వేలు ఉండగా ప్రభుత్వం వీటిని ఉచితంగా అందచేయడంతో పాటు కిట్ తయారీ చేసిన కంపెనీ ట్రైనర్లతో ట్రైనింగ్ ఇప్పిస్తోంది. ఈ నెల 10 కల్లా వీటిని పంపిణీ చేయాలని ఇటీవల బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. కార్పొరేషన్ కు మొదటి, రెండో క్వార్టర్ కు ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. ఈ నిధులను కిట్ లకు ఖర్చు చేయనున్నట్టు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.