- మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులు
- గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, గుడులు, చర్చిలు, మసీదులకు ఫండ్స్
- ప్రభుత్వ పథకాలకు శరవేగంగా లబ్ధిదారుల ఎంపిక
- 695 కోట్లతో మూడు రిజర్వాయర్లకు ప్రతిపాదనలు
కామారెడ్డి, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న కామారెడ్డికి నిధుల వరద పారుతున్నది. గత 40 రోజుల వ్యవధిలో సెగ్మెంట్లోని వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఏకంగా రూ. 280 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసింది. కామారెడ్డి నియోజకవర్గంలో భగీరథ పైప్‌లైన్ కోసం అత్యధికంగా రూ.195 కోట్లు వినియోగిస్తుండగా, మిగిలిన ఫండ్స్‌లో రూ.45 కోట్లతో కామారెడ్డి టౌన్లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కులాలవారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ఊరూరా కమ్యూనిటీ భవనాలు, వివిధ వర్గాల ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు గుడులు, చర్చిలు, మసీదులకు ఇప్పటికే సుమారు రూ.50 కోట్ల దాకా ఫండ్స్ శాంక్షన్ చేశారు. మరోవైపు దళితబంధు, గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ ఆర్థిక సాయం స్కీములకు లబ్ధిదారుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది.
కామారెడ్డి టౌన్‌కు రూ.45 కోట్లు..
కామారెడ్డి టౌన్లో వివిధ అభివృద్ధి పనుల కోసం సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి రూ. 45 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 25 కోట్లను మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పనులకు కేటాయిస్తూ ఇప్పటికే జీవో ఇచ్చారు. వీటిలో మెయిన్ రోడ్ల వెడల్పు, కాలనీల్లో సీసీ, బీటీ రోడ్లు, పాత హైవేపై మిగిలిన ఏరియాల్లో సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల డెవలప్మెంట్లాంటి వర్క్స్ఉన్నాయి. వీటితోపాటు స్టేడియం ఆధునీకరణ, స్పోర్ట్స్‌కాంప్లెక్స్ కోసం రూ. 20 కోట్లు శాంక్షన్ చేశారు.
కమ్యూనిటీ హాళ్లకు రూ.32.50 కోట్లు
కేసీఆర్‌ను ఎలాగైనా గెలిపించుకోవాలని భావిస్తున్న లీడర్లు కుల సంఘాలతో పాటు వివిధ వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు సీఎం స్పెషల్ డెవ లప్మెంట్ ఫండ్స్(ఎస్డీఎఫ్) నుంచి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయించగా, 13 రోజుల క్రితం మరో రూ. 15 కోట్లు శాంక్షన్ అయ్యా యి. ఒక్కో దానికి రూ. 3 లక్షల నుంచి రూ. 8 లక్షల చొ ప్పున ఇప్పటిదాకా రూ.12.50 కోట్లు ఖర్చు చేశారు. మిగతా రూ.2.50 కోట్లను పంచాయతీ బిల్డింగులు, స్కూళ్ల రిపేర్లకు కేటాయించారు.
గుడులకు ప్రత్యేకంగా రూ.10 కోట్లు
కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ టెంపుల్స్కోసం ఇటీవల వేములవాడ, యాదాద్రి దేవస్థానాల నుంచి రూ.5 కోట్ల చొప్పున రూ.10 కోట్లు ఇవ్వాలని ఎండోమెంట్కమిషనర్ఆదేశాలివ్వగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్న సర్కారు, 3 రోజుల క్రితం సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్‌ఫండ్ నుంచి రూ.10 కోట్లు మంజూరు చేసింది.
ALSO READ :- మైసూర్లో ప్రభాస్ మైనపు విగ్రహం.. ఫుల్లుగా నవ్వుకుంటున్న నెటిజన్స్
నియోజకవర్గంలోని162 టెంపుల్స్‌కు ఈ ఫండ్స్ కేటాయించారు. ఆలయాల స్థాయి, అవసరాలను బట్టి ఒక్కో గుడికి రూ. 3 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు కేటాయిస్తున్నారు. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్‌కు రూ. కోటి, ఇదే మండల కేంద్రంలోని మరో రెండు టెంపుల్స్‌కు రూ. 25 లక్షల చొప్పున, భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయానికి రూ. 2 కోట్లు మంజూరు చేశారు. ఇక వివిధ గ్రామాల్లో కొత్త మసీదులు, చర్చిల నిర్మాణానికి కూడా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా కేటాయిస్తున్నారు.
పైపులైన్‌కు రూ.195 కోట్లు
కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఏడాది కాలంగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి సదాశివనగర్ మండలం మల్లన్న గుట్ట ఫిల్టర్ బెడ్ వరకు కాంగ్రెస్ హయాంలో వేసిన మెయిన్ పైపులైన్ నే మిషన్ భగీరథకు వాడుకున్నారు. ఇది15 ఏండ్ల కింద వేసిన పైపులైన్ కావడంతో తరచూ పగుళ్లు, లీకేజీలతో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. కొన్ని గ్రామాల్లో నాలుగైదు రోజులకోసారి తప్ప నీళ్లు రావట్లేదు. ఇది ఎన్నికలపై ప్రభావం చూపనుందని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో మెయిన్ పైపులైన్ మార్చేందుకు రూ.195 కోట్ల ఫండ్స్ శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం ఈనెల 5న జీవో రిలీజ్ చేసింది. జలాల్పూర్ నుంచి ఆర్గుల్, ఇందల్వాయి మీదుగా మల్లన్న గుట్టవరకు 47 కిలోమీటర్ల మేర కొత్త పైపులైన్ వేస్తారు. దీనివల్ల కామారెడ్డి టౌన్, కామారెడ్డి రూరల్, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట మండలాలల్లో తాగునీటి కష్టాలు తీరనున్నాయి.
695 కోట్లతో రిజర్వాయర్లకు ప్రతిపాదనలు
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 22 పెండింగ్పనుల్లోనూ కదలిక మొదలైంది. ఈ ప్యాకేజీ పరిధిలోని పనుల తాజా పరిస్థితి, భూ సేకరణ పక్రియపై ఇరిగేషన్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులు పూర్తి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. అధికారులు చెప్తున్నదాని ప్రకారం నియోజకవర్గంలో కొత్తగా మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సర్కారుకు ప్రపోజల్స్ అందజేశారు. కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి, లింగంపేట మండల మోతె రిజర్వాయర్లకు ఒక్కో దానికి రూ. 310 కోట్లతో మొత్తం రూ.620 కోట్లు, గాంధారి మండలం కాటేవాడి రిజర్వాయర్‌కు రూ. 75 కోట్లతో ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లోనూ ఈ ఫండ్స్ కూడా మంజూరు కానున్నట్లు తెలుస్తోంది.