- బోర్డులు తప్ప ఫెన్సింగ్ లేదు, సౌకర్యాలు లేవు!
- రూ.50వేల పనికి రూ.లక్షలు స్వాహా!
- క్షేత్రస్థాయిలో తనిఖీ చేయని ఆఫీసర్లు
- నిర్వహణ లేక గ్రౌండ్లలో మళ్లీ మొలుస్తున్న చెట్లు
హనుమకొండ, వెలుగు:
ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆట స్థలాల్లో పెద్ద ఎత్తున నిధులు స్వాహా అయ్యాయన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మండలానికి కనీసం ఆరేడు గ్రామాల చొప్పున ఎంపిక చేసి, ప్లేగ్రౌండ్లు ఏర్పాటు చేశారు. చాలాచోట్ల స్కూల్ గ్రౌండ్లు, జీపీ ఖాళీ జాగలు సాఫ్ చేసి క్రీడా ప్రాంగణాలుగా బోర్డులు పాతారు తప్పితే.. కనీసం సౌకర్యాలు కల్పించలేదు. వాటి నిర్వహణను కూడా గాలికొదిలేయడంతో గ్రౌండ్ లో చెట్లు మొలిచి మళ్లీ మొదటికొచ్చాయి.
ఇదీ సంగతి..
క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు యువతలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఆటలకు సంబంధించి కనీస సౌలతులు కల్పించకపోవడంతో ప్రస్తుతం పడావుపడ్డాయి. సౌకర్యాలు కల్పించడానికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ.. కేవలం బోర్డులు పాతి వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదును చేసి వదిలివేయడం మినహా ఎక్కడా ఆటవస్తువులు కొనుగోలు చేయలేదు. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారు.
ఉన్న గ్రౌండ్లకే బోర్డులు..
గ్రామాలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయగా.. చాలా చోట్ల స్కూల్, కాలేజీ గ్రౌండ్లకే క్రీడా ప్రాంగణాలు అని బోర్డులు పెట్టారు. వరంగల్ సిటీలో పరిస్థితిని పరిశీలిస్తే.. ఖిలా వరంగల్ మధ్యకోటలో ఆరెల్లి బుచ్చయ్య గౌడ్ ప్రభుత్వ స్కూల్‌కు తెలంగాణ క్రీడా ప్రాంగణం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ఏర్పాటు మినహా అక్కడ ఎలాంటి పనులు చేయలేదని స్థానికులు చెబుతున్నారు. శంభునిపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర కూడా ఇదే పరిస్థితి. పైడిపల్లి గ్రామంలోని హైస్కూల్ లో గ్రౌండ్చదును చేసి బిల్లులు తీసుకున్నట్లు తెలిసింది. వాలీబాల్ పోల్స్ తెచ్చి బిగించినప్పటికీ అవి ఇదివరకు కొట్టిన వానలకు నేలకూలాయి. ఇలా ఎక్కడికక్కడా సౌకర్యాలు కల్పించకుండానే బిల్లులు కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల రూ.వేలల్లో ఖర్చు పెట్టి.. రూ.లక్షల్లో బిల్లులు లేపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకనైనా సంబంధిత ఆఫీసర్లు తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై దృష్టి పెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు సాధ్యమైనంత తొందర్లో మిగతా మైదానాలకు అందుబాటులోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బోర్డులకే రూ.లక్షలా?
గ్రామాలు, పట్టణాల్లో క్రీడా మైదానాల విస్తీర్ణాన్ని బట్టి ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఇందులో తక్కువలో తక్కువ రూ.50 వేల నుంచి రూ.4.5లక్షల వరకు చెల్లిస్తోంది. ఈ మేరకు సంబంధిత కాంట్రాక్టర్లు అక్కడి పరిస్థితులను బట్టి అన్ని వయస్సుల వారికి ఉపయోగపడేలా క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచడంతో పాటు వాకింగ్‌ట్రాక్‌లు, పిల్లల ఆట వస్తువులు, బెంచీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ ఏర్పాట్లేమీ కనిపించడం లేదు. క్రీడా మైదానమని చెప్పుకోవడానికి కేవలం బోర్డులు ఏర్పాటు చేసి, అక్కడ కొంత భూమిని చదువును చేసి వదిలేశారు. దీంతో క్రీడా ప్రాంగణాల లక్ష్యం నెరవేరకపోగా.. నిధులు మొత్తం దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది హనుమకొండ జిల్లా దామెర మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ఆట స్థలం. ఇక్కడ గ్రౌండ్‌కు అనువైన స్థలం లేకపోవడంతో పక్కనే ఉన్న గుట్టను చదును చేసి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. నామ్ కే వాస్తే అన్నట్టుగా కొంతమేర మొరం నేర్పి వదిలేశారు. అనంతరం దానిని అలాగే వదిలేయడంతో పిచ్చి మొక్కలు పెరిగి, ఆటలకు పనికి రాకుండా పోయింది. ఇక్కడ వర్క్స్ కంప్లీట్ కాకుండానే సంబంధిత కాంట్రాక్టర్ బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.