- కోర్టు కేసు, పంచాయితీ తేలక మనస్తాపంతో అన్న ఆత్మహత్య
- పంపకాల తర్వాతే దహన సంస్కారాలు నిర్వహించిన కుటుంబీకులు
చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో ఓ కుటుంబంలో భూమి పంపకాలు చిచ్చు పెట్టాయి. సంవత్సరాల తరబడి ఎటూ తేలకపోవడంతో మనస్తాపం చెందిన అన్న ఆత్మహత్య చేసుకోగా పంపకాల సంగతి తేలాకే అంత్యక్రియలు చేయాలంటూ డెడ్‌బాడీని నాలుగు రోజుల పాటు మార్చురీలోనే ఉంచారు. పంతంగి గ్రామానికి చెందిన చిరిక హనుమంత రెడ్డి హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇతడికి ఓ తమ్ముడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
వీరికి గ్రామంలో వారసత్వంగా 7.24 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చింది. ఈ భూమి పంపకాల విషయంలో చాలా రోజులుగా నలుగురి మధ్య తగాదాలు నడుస్తున్నాయి. భూమిలో తమకు సమాన వాటా కావాలంటూ అక్కాచెల్లెళ్లు కోర్టులో కేసు వేయగా అది ఏండ్లుగా నడుస్తోంది. చివరకు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని అనడంతో శనివారం హనుమంతరెడ్డి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు డెడ్‌బాడీని చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
పెద్ద మనుషులు జోక్యం చేసుకోవడంతో...
తన భర్త బతికి ఉన్నప్పుడు భూమి పంచకుండా మానసికంగా హింసించారని, చనిపోయాక అయినా ఆయన భూమిని పంచి ఇస్తే ఆత్మ శాంతిస్తుందంటూ మృతుడి భార్య, ఆమె తరుపు బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్తి పంపకాలు జరిగిన తర్వాతే పోస్టుమార్టం చేయాలని, ఆడపడుచులు కోర్టులో వేసిన కేసును వాపసు తీసుకున్న తర్వాతే అంత్య క్రియలు చేయనిస్తామని భీష్మించుకు కూర్చున్నారు.
దీంతో శనివారం నుంచి మృతదేహం చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ రూమ్‌లోనే మగ్గుతోంది. దీంతో ఊరి పెద్ద మనుషులు కలగజేసుకొని మంగళవారం ఉదయం అందరు కుటుంబీకులతో మాట్లాడారు. కేసు వేసిన అక్కాచెల్లెళ్లను వాపస్ తీసుకునేలా ఒప్పించారు. ఏడున్నర ఎకరాల్లో మృతుడి కుటుంబానికి నాలుగెకరాలు, సోదరుడి కుటుంబానికి మిగిలిన భూమి రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పందం చేయించి అంతక్రియలు జరిగేలా చేశారు.