
- పాల్వంచ చెరువుల్లో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం
- ఇప్పటివరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన పెంపకందారులు
- ఇప్పుడు కుళ్లిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన
- ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు
ఖమ్మం, వెలుగు: చేపల చెరువుల వ్యాపారులు, చేపల పెంపకందారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చేపల చెరువుల్లో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి చికెన్ షాపుల వ్యర్థాలను చేపల దాణాగా వాడుతున్నారన్న ప్రచారం ఉండగా, రెండ్రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపురం చేపల చెరువులో చనిపోయిన, కుళ్లిపోయిన కోళ్లను ఆహారంగా వేయడం కలకలం రేపింది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా, వ్యాపారంలో లాభం కోసం రోగాల బారినపడి, చనిపోయిన కోళ్లను చేపల చెరువుల్లో వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేపల పెంపకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఫంగస్ చేపలకు ఆహారంగా!
పాల్వంచ మండలం రాజాపురంలో కిన్నెరసాని ఒడ్డున ఓ వ్యక్తి రెండెకరాల్లో చేపల చెరువును నిర్మించాడు. గత కొన్నేళ్లుగా ఏపీ నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ చెరువులను లీజుకు తీసుకొని, ఫంగస్ రకం చేపలను పెంచుతున్నారు. ఇన్ని రోజులుగా చేపలకు ఆహారంగా చికెన్ షాపుల నుంచి వ్యర్థాలను సేకరించి వేస్తున్నారు. తాజాగా.. చేపలకు చనిపోయిన, కుళ్లిపోయిన కోళ్లను మేతగా వేస్తున్నారు. దీంతో కోళ్ల నుంచి వ్యాధులు వ్యాపించి, చేపలకు కూడా కొత్త రకం రోగాలొస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన, కుళ్లిపోయిన కోళ్ల కారణంగా చెరువు చుట్టుపక్కల దుర్వాసన వ్యాపించడంతో మత్స్యశాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం ఎంక్వైరీ చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కుళ్లిపోయిన కోళ్ల కారణంగా నీళ్లు, గాలి కలుషితం కావడం వల్ల మనుషులకు కూడా వ్యాధులు వచ్చే ప్రమాదముందని చెప్పారు.
రూ. కోట్లలో చికెన్ వ్యర్థాల వ్యాపారం!
రాష్ట్రంలో పలుచోట్ల చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలను ఉపయోగిస్తుండడంతో చికెన్ షాపుల్లో వేస్టేజీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు రోడ్ల వెంబడి పారబోసే వేస్టేజీ మీద ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తున్నది. ఖమ్మం నగరంలో 200కు పైగా చికెన్ షాపులున్నాయి. మూడేండ్ల క్రితం వరకు ఈ షాపుల్లో వచ్చే వ్యర్థాలను (కోళ్ల పేగులు, కాళ్లు, మెడ, తలకాయ, స్కిన్) చికెన్ షాపుల ఓనర్లు ఊరి బయట పారేసేవారు. ఆ తర్వాత కొంత మంది వ్యాపారులు డ్రమ్ములు తీసుకొని వచ్చి, వ్యర్థాలను సేకరించడం మొదలుపెట్టారు. ఇందుకోసం ఒక్కోషాపుకు రూ.20 వేల వరకు అడ్వాన్స్ ఇచ్చి, నెలకు రూ.3 వేల చొప్పున చెల్లించేవారు. ఈ వ్యర్థాలను చేపల చెరువుల యజమానులకు కిలో రూ.15 చొప్పున అమ్మేవారు. ఆ తర్వాత ఈ వ్యర్థాలను సేకరించేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వేలంపాట నిర్వహించడం మొదలుపెట్టారు. మొదటి ఏడాది రూ.44 లక్షలు పలికింది. 2023 డిసెంబర్ లో నిర్వహించిన వేలం పాటలో ఆరుగురు పాల్గొనగా, ఏకంగా రూ.1.55 కోట్లకు గద్వాల జిల్లాకు చెందిన బాలరాజు అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నారు. కోళ్ల వ్యర్థాల కోసం కేవలం మున్సిపాలిటీకే రాయల్టీగా కోటిన్నర చెల్లించారు.
ఆ చేపలు తింటే డేంజరే!
చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలతో రోగాలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మాంసం తినే క్యాట్ ఫిష్ లాంటి చేపలు తినడం వల్ల క్యాన్సర్ సహా ఇతర రోగాలు వచ్చే ప్రమాదం ఉండడంతో, ఈ చేపల పెంపకాన్ని రాష్ట్రంలో నిషేధించారు. అయినా అక్కడక్కడా రహస్యంగా ఈ క్యాట్ ఫిష్ పెంచుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఫంగస్ చేపలు కూడా కోళ్ల వ్యర్థాలతో పెంచుతుండడం డేంజరస్‌గా మారింది. ఈ విషయం తెలియక ఫంగస్ చేపలను పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా కిలో రూ.100 చొప్పున కొనుక్కొని తింటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు చేసిన ఫంగస్ చేపలు.. హైదరాబాద్ సహా ఏపీలోని పలు నగరాలకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. వీటి నుంచి ఆయిల్ కూడా తీస్తారని చేపల వ్యాపారులు చెబుతున్నారు.