
- ఆరెకటికల మహాసభలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బషీర్‌బాగ్, వెలుగు: భవిష్యత్ తెలంగాణ బీసీలదేనని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసమే స్థానిక ఎన్నికలను వాయిదా వేశామన్నారు.
మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో కాంగ్రెస్ నేత చెకో లేకర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక మహాసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహేశ్కుమార్గౌడ్పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆరెకటికల పాత్ర ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పాలన బీసీలకు సువర్ణ అధ్యాయం అని, బీసీలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఆరెకటికలను బీసీ -డీ నుంచి బీసీ -ఏ కు మార్చడంపై చర్చిస్తామని తెలిపారు.
దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్రాన్ని అడిగే ధైర్యం బండి సంజయ్ కి ఉందా ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేకోలేకర్ లక్ష్మి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్రి అనిల్ పాల్గొన్నారు.