జీ-20 దేశాల18వ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీ కేంద్రంగా ‘భారత్ మండపంలో’ ప్రారంభం కాబోతున్నది. ప్రపంచ భూభాగంలో 75% వాటా, అంతర్జాతీయ వాణిజ్యంలో 85% వాటా కలిగిన19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిగిన ఈ కూటమి ఐక్యరాజ్యసమితి తర్వాత బలమైన కూటమిగా చెప్పవచ్చు, గత సంవత్సరం బాలిలో జరిగిన సదస్సు తర్వాత భారత్ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంది. ఈ సంవత్సర కాలంలో వంద జీ20 సమావేశాలు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అన్నింటిని కలిపి దేశవ్యాప్తంగా 41 నగరాల్లో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం.. భౌగోళికంగా ఇంతవరకు ఇంత భారీ విస్తీర్ణంలో గతంలో ఏ దేశంలో నిర్వహించని విధంగా విస్తరించింది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశం.. గత సమావేశాలకు భిన్నంగా భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాలను నిర్వహించబోతున్నది. అన్ని రంగాల్లో విశ్వ గురువుగా ఎదుగుతున్న భారత్ ఈ సమావేశంలో కొత్త నినాదాన్ని ప్రకటించింది ‘ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ నినాదంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నది. చాలామంది భారత్ కు సాంప్రదాయం ప్రకారం మాత్రమే అధ్యక్షత బాధ్యత వచ్చిందని అంటున్నారు కానీ నిజంగా భారత్కు అధ్యక్ష వహించే అర్హత ఉన్నది.
మారిన భారత్ ముఖచిత్రం
కొన్ని వేల సంవత్సరాల పాటు పరాయి పాలనలో ఉన్న మన దేశం.. స్వాతంత్ర్యం తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఒకవైపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా, అత్యధిక పేదరికం ఉన్న దేశంగా ఉన్న పరిస్థితి నుంచి నేడు పేదరికం తగ్గిస్తూ నూతన ఆవిష్కరణ దిశగా ప్రయాణిస్తున్నది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన దేశ ప్రధాని దేశ పురోగతి, అభివృద్ధిపై దేశ ప్రజలకు వివరించారు. గతంలో మనకు అవసరమైనటువంటి వస్తువులను ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. హరిత విప్లవం, మేక్ ఇన్ ఇండియా లాంటి పథకాల ద్వారా మనం వ్యవసాయ రంగంలోనే కాకుండా రక్షణ, సాంకేతిక, సమాచార రంగంలో దేశీయంగా అవసరాలు పోను ఎగుమతి చేసే పరిస్థితికి ఎదిగాం.
కనీస సౌకర్యాలు లేని అంతరిక్ష కేంద్రాలు సాంకేతికంగా అభివృద్ధి సాధించి అగ్రరాజ్యాలకు సాధ్యం కాని పనిని మన శాస్త్రవేత్తలు సుసాధ్యం చేస్తున్న తీరు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నది. అందుకు నిదర్శనం చంద్రయాన్ 3, ఆదిత్య-L1 ప్రయోగాలు. వీటి ద్వారా మన దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ దేశాలకు తెలిసింది. నేడు చంద్రుడిపై ప్రయోగాన్ని సక్సెస్ చేయడమే కాకుండా సూర్యుడిపై ప్రయోగం చేసే స్థాయికి మన దేశం ఎదిగింది. సమావేశాలకు అధ్యక్ష వహించే అర్హత భారత్కు ఉందని ప్రపంచ దేశాలు గుర్తించేలా మన శాస్త్రవేత్తలు చేశారు.
సమర్థ నాయకత్వం
చాలా సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఫుల్ మెజారిటీతో ఏర్పాటు ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నూతన దిశగా ప్రయాణిస్తుంది. బానిస చట్టాలకు చరమగీతం పాడుతూ కొత్త ఆలోచనలతో ముందుకు పోతుంది. నేడు దేశంలోనే డిజిటల్ విప్లవాన్ని తీసుకొని రావడం జరిగింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలను తీసుకున్న నాటినుండి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన సమావేశాల కారణంగా నేడు ఆయా రాష్ట్రాలు సభ్య దేశాలతో వాణిజ్య, పర్యాటక ఒప్పందాలను చేసుకునే పరిస్థితిని తీసుకువచ్చింది. దీని కారణంగా అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదులతో నిరంతరం కాల్పుల మోతలు వినిపించే జమ్ము కాశ్మీర్ లో నేడు జీ20 దేశాల సంబంధించిన అందాల పోటీలను నిర్వహించే స్థాయికి ఎదిగింది. నేడు ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ కు వస్తున్నారు. రక్షణ పరంగా బలోపేతం అవుతూ అంతర్గత సమస్యలను అధిగమిస్తూ నేడు మన దేశం వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్తుంది. నిజంగా జీ-20 దేశాలకు అధ్యక్ష వహించడం 140 కోట్ల భారతీయులందరికీ కూడా గర్వంగా భావించాలి భారత్ 2047లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించబోతుందని మోదీ గారు చెప్పిన మాటలకు ఈ సమావేశాలు నాంది కావాలని ఆశిస్తున్నాం. జై భారత్..
మన పాత్ర పెరిగింది
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చిన్నాభిన్నమవుతున్న సందర్భంలో దేశాలన్నీ శవాల దిబ్బగా మారినటువంటి పరిస్థితుల నుంచి అనేక ప్రపంచ దేశాలను కాపాడింది మన దేశం. కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాలకు అందించి విశ్వగురుపాత్రను పోషించింది. నేడు ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడా మన దేశంతో వాణిజ్య, రక్షణ సాంకేతికపరంగా అనేక ఒప్పందాలను చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితిలో మనం ఇచ్చే సందేశానికి చాలా విలువ పెరిగింది. నిరంతరం ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని, అన్ని సమస్యలు కూడా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇస్తున్నది భారత్. ఒక వైపు పక్క దేశాలతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూనే అంతర్గత సమస్యలను చక్కదిద్దుకుంటూ ఒక ప్రణాళికబద్ధంగా దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిచే విధంగా మన పాలకులు చేశారు. గతంలో ప్రపంచ క్రీడారంగంలో మన పాత్ర నామమాత్రంగానే ఉండేది. కానీ నేడు అది పూర్తిగా మారిపోయింది. ప్రపంచ దేశ క్రీడాకారులను మన క్రీడాకారులు ఓడిస్తున్నారు. గత ఒలింపిక్స్ నుంచి ప్రపంచ వేదికల పైన మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఇటీవల జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలు, ప్రపంచ ఆర్చరీ పోటీలు, ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీలు.
- డా. చింత ఎల్లస్వామి, ఉస్మానియా యూనివర్సిటీ