గడ్డం వంశీకృష్ణకే మాలల మద్దతు : చెన్నయ్య

లక్సెట్టిపేట, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకే మాలల పూర్తి మద్దతు ఉంటుందని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బుధవారం లక్సెట్టిపేటలోని గురునానక్ గార్డెన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన దళిత బహుజనులకు పిలుపునిచ్చారు. 

యువకుడు, విద్యావంతుడైన వంశీని గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోఎస్సీ కార్పొరేషన్​ను నిర్వీర్యం చేశారని, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితులకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లతోపాటు అన్ని కులాల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. దళిత బహుజనులు అభివృద్ధిలోకి రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్, మన్నె శ్రీధర్ రావు, దమ్మ నారాయణ, మధు, మల్లన్న, చిన్నయ్య, రవి, సత్తయ్య, వేంసాగర్ పాల్గొన్నారు.