
- కాంగ్రెస్ ది రెండు నాల్కల ధోరణి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- మేడిగడ్డపై కాంగ్రెస్కు మాట్లాడే హక్కు లేదు
- విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 25 ఏండ్లుగా మజ్లిస్ పార్టీ ఏకగీవ్రంగా హైదరాబాద్ ఎమెల్సీగా పోటీ చేస్తూ వస్తోందని, ఈసారి ఆ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతిచ్చాయని విమర్శించారు. మజ్లిస్ ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందనే సంకేతాలను ప్రజలకు ఇచ్చేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినట్టు కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన పదాధికారుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ కూలడం నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ అనేది చట్టబద్ధమైన సంస్థ అని.. సలహాలు, సూచనలు ఇచ్చే సంస్థ అని కిషన్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని.. కానీ, చర్యలు తీసుకోకుండా ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పొరపాట్లు ఎక్కడెక్కడ జరిగాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇన్నాళ్లు ఫాం హౌస్ లో నిద్రించారని, ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి కార్యక్రమాలను సైతం బహిష్కరించారని గుర్తుచేశారు.
తుపాకీ పట్టుకొని శాంతి చర్చలంటే ఎట్లా?
చేతిలో తుపాకీ పట్టుకొని శాంతి చర్చలు చేయాలనడం ఎంత వరకు సమంజసమని కిషన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో కంటే మోదీ వచ్చాక ఉగ్రవాదం పూర్తిగా తగ్గిందని, వారి పాలనలో హైదరాబాద్ లోనూ బాంబు బ్లాస్ట్ లు జరిగాయన్నారు. కశ్మీర్ అభివృద్ధి ఈ దేశంలో ఉన్న అంతర్గత, పాకిస్తాన్ శక్తులకు ఏమాత్రం ఇష్టం లేదని ఫైర్అయ్యారు. పహల్గాం ఘటనను దేశమంతా వ్యతిరేకిస్తోందని, ప్రాంతాలకతీతంగా సైన్యానికి అండగా ఉండాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ బాధ్యతను మరిచి ప్రధానిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం సరికాదని, పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ తివారి, తదితరులు పాల్గొన్నారు.