మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పోలింగ్ కేంద్రాల్లో ఫర్నిచర్, వెబ్ కాస్టింగ్, ఇతర సౌలతులను మరోసారి చెక్ చేసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్లపై సోమవారం ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు తనిఖీ చేసుకోవాలని, టాయిలెట్లు, తాగు నీటిపై దృష్టి పెట్టాలన్నారు.
ఆర్వోలు అనిల్ కుమార్, మోహన్ రావు, నటరాజ్, డీఆర్వో యాదయ్య, డీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ఈ నెల 30న ప్రభుత్వ, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు కలెక్టర్ జి. రవి నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
లెక్కింపు కేంద్రాల పరిశీలన
పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ మిశ్రా పరిశీలించారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ బిల్డింగ్‌లో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాల్లో బారికేడింగ్, టేబుల్స్, ఏజంట్లు, అధికారులు, సిబ్బంది వచ్చేందుకు ఎంట్రీలను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూముల్లో ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
వనపర్తి : చిట్యాలలోని ఏఎంసీ మార్కెట్ గోదామ్‌లో ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. పోలింగ్ రోజు సెక్టోరియల్, పీవో, ఏపీవోలకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సిబ్బందికి భోజనం ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతి రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
నారాయణపేట: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సింగారంలోని రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. పోలింగ్ కు ముందు 48 గంటల సైలెన్స్ పీరియడ్ లో రాజకీయపరమైన ఎస్ఎంఎస్, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపవద్దని తెలిపారు.