మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఎంట్రీ చేసేందుకు ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం నుంచి కంప్యూటర్ లో ఎంట్రీ చేయాలన్నారు. జిల్లాలో 213 సిస్టమ్స్ తో పాటు 400 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించామని తెలిపారు.
ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని, 3 విడతలుగా డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసుల్లోనే ఈ ప్రక్రియ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ సంస్థలు, ఆఫీసుల్లో చేయవద్దన్నారు. డేటా భద్రంగా ఉంచే బాధ్యత టీమ్ లీడర్లపై ఉందన్నారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, ఎస్ .మోహన్ రావు పాల్గొన్నారు.