హైదరాబాద్: కాకా వెంకటస్వామి 95వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాకా కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకా కుమారుడు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాకా సేవలను నేతలు యాది చేసుకున్నారు. కాకాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. విద్యాసంస్థల ద్వారా అంబేద్కర్ ఆశయాలను కాకా నెరవేర్చారని చెప్పారు. మలి దశ పోరాటంలోనూ ఆయన కృషి మరువలేనిదని, తొలి, మలి దశ ఉద్యమాల్లో కాకా పాత్ర కీలకం అని కోదండరాం కాకా సేవలను కొనియాడారు. ఎన్ని కష్టాలొచ్చినా కాంగ్రెస్ను వీడలేదని, కాకా జీవితంపై డాక్యుమెంటరీ తేవాలని కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కాకా అద్భుత శక్తి అని కోదండరాం చెప్పారు.
ALSO READ | కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: మంత్రి పొన్నం
బలహీన వర్గాల కోసం కాకా వెంకటస్వామి అలుపెరగని పోరాటం చేశారని ఆయన సేవలను కొనియాడారు. ప్రాణహిత ప్రాజెక్టు కార్యరూపానికి కాకానే కారణం అని మధుయాష్కీ చెప్పారు. దివంగత నేత కాకా మనందరికీ మార్గదర్శి అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. పేద విద్యార్థుల కోసమే అంబేద్కర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివేక్ గుర్తుచేశారు. డొనేషన్లు లేకుండా విద్య అందించడమే లక్ష్యమని అంబేద్కర్ విద్యా సంస్థల లక్ష్యమని ఆయన చెప్పారు. అంబేద్కర్ విద్యాసంస్థలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న విషయాన్ని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వివరించారు.