మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు.. ముహూర్తం ఏప్రిల్ 3

మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు.. ముహూర్తం ఏప్రిల్ 3
  • కేబినెట్‌లో నలుగురు లేదా ఐదుగురికి అవకాశం
  • ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి చాన్స్​
  • మంత్రి పదవులతోపాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌ పదవులూ భర్తీ 
  • సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక 
  • గతంలో ఇచ్చిన హామీలు, ప్రాతినిధ్యం లేని 
  • జిల్లాలను పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్ 
  • ఇప్పటికే ఆయా నేతలకు సంకేతాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణ జరగనుంది. నలుగురు లేదా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు తెలుస్తున్నది. అలాగే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. మంత్రి పదవి ఆశించి రానోళ్లకు ఈ రెండు పదవులు అప్పగిస్తారని సమాచారం. కేబినెట్ విస్తరణపై సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు పూర్తి చేసింది. 

మంగళవారం డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైనా క్లారిటీ వచ్చిందని.. ఆ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాలకు హైకమాండ్ పెద్దపీట వేసినట్టు తెలిసింది. అలాగే గతంలో నేతలకు ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో పదవులు దక్కనున్న నేతలకు హైకమాండ్ ఇప్పటికే సంకేతాలు పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

బీసీల నుంచి ముగ్గురి పేర్లు.. 

మంత్రి పదవుల్లో రెండు రెడ్లకు, రెండు బీసీలకు, ఒక్కటి ఎస్సీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలిసింది. రెడ్డి సామాజికవర్గం కోటాలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆ జిల్లాలో సుదర్శన్ రెడ్డి  సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమైందనే ప్రచారం సాగుతున్నది. 

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని పార్టీలో చేరేముందు రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్​హామీ ఇచ్చింది. దీంతో ఆయనకు సైతం కేబినెట్​బెర్త్​ ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు బీసీలకూ రెండు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అందులో ఒకటి ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి దాదాపు ఖాయమైనట్టు తెలుస్తున్నది. బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్‌‌‌‌లకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్‌‌‌‌సభ ఎన్నికల టైమ్‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

అప్పుడే వాకాటి శ్రీహరి పేరును కూడా ప్రకటించారు. ఇక బీసీ కోటాలో రెండో పదవి కోసం మున్నూరుకాపు వర్గానికి చెందిన విప్ ఆది శ్రీనివాస్, యాదవ సామాజిక వర్గానికి చెందిన విప్ బీర్ల అయిలయ్య పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాల్లో హైకమాండ్ ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు ఎస్సీల్లో ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు వినిపిస్తున్నది. కాంగ్రెస్‌‌‌‌లో చేరేముందు రాజగోపాల్​రెడ్డితో పాటు వివేక్​వెంకటస్వామికి కూడా మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది.