
జీ–20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశాలు కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగాయి. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇండోనేషియా ఆర్థిక మంత్రి ముల్యాని ఇంద్రావతి, బ్రెజిల్ కేంద్రీయ బ్యాంక్ గవర్నర్ రాబర్ట్ డి ఒలివైరా, ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా జార్జివా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆన్లైన్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
ఈ సదస్సుకు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. జీ–20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల సమావేశాల తొలి సెషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కలిసి నిర్వహించారు. సమర్థ పాలన, సమగ్ర అభివృద్ధి, ఆవిష్కరణలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్థిక మంత్రులు, నిపుణులు మాట్లాడారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా ప్రసంగించారు. 2023 అంతర్జాతీయ వృద్ధిలో భారత్ వాటా సుమారు 15శాతం ఉండొచ్చని అంచనా వేశారు.
ఉక్రెయిన్ యుద్ధంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సంయుక్త ప్రకటన లేకుండానే బెంగళూరులో జరిగిన జీ–20 ఆర్థిక మంత్రుల సదస్సు ముగిసింది. సరిహద్దు చెల్లింపులు, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సురక్షిత ఆర్థికతను కొనసాగించేందుకు క్రిప్టో కరెన్సీ ఆవశ్యకతను గుర్తు చేసిన భారత అభిప్రాయానికి బ్రిటన్, అమెరికా దేశాలు మద్దతు ఇచ్చాయి.