సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు తన భారత పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన బైడెన్.. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. కానీ తాను త్వరలోనే అతన్ని చూడనున్నట్టు బైడెన్ చెప్పారు.
న్యూఢిల్లీలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న G20 సదస్సుకు జో బైడెన్‌తో పాటు ఇంకా చాలా మంది ప్రపంచ నేతలు హాజరుకానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
ALSO READ: సెప్టెంబర్ 5న ఆర్టీసీ రాఖీ పండగ లక్కీ డ్రా.. అదృష్టవంతులెవరో..
G20 సభ్య దేశాలు ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి పైగా, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. వీటిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, UK, US, యూరోపియన్ యూనియన్ (EU)దేశాలు ఉన్నాయి.