- సెప్టెంబర్ 3 నుంచి గచ్చిబౌలిలో టోర్నీ
- నేడు నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక స్పోర్ట్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా, మారిషస్, సిరియా జట్లు పోటీ పడే ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నాలుగో ఎడిషన్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. సెప్టెంబర్ 3,6,9వ తేదీల్లో జరిగే ఈ టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ పాల్గుణ బుధవారం ఎల్బీ స్టేడియంలో విడుదల చేశారు.
ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ అన్ని సౌకర్యాలు కల్పించి, అవసరమైన సహకారం అందిస్తున్నాయని తెలిపారు. మరోవైపు హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా గురువారం నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టు శివసేనా రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రధాన వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయన్నారు.