- మరో 15 మందిపై న్యూసెన్స్ కేసు నమోదు
- పార్టీలో పాల్గొన్న యువతులు, సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులు
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లోని ఓ ఇంట్లో జరుగుతున్న బర్త్‌డే పార్టీలో గంజాయి వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో గచ్చిబౌలి, మాదాపూర్ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకోగా, వీరిలో ఆరుగురు యువతులు ఉన్నారు.
వీరందరికీ డ్రగ్స్ టెస్టులు చేయగా, ముగ్గురికి గంజాయి పాజిటివ్ వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీ ఫేజ్1లో ఉన్న లక్ష్మీ అనే మహిళ ఇంట్లో రిలయన్స్ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న చరణ్, వినీల్, శివశంకర్రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి రాధా అనే ఫ్రెండ్ఉండగా, అతని ద్వారా రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆదిత్య పరిచమయ్యాడు.
ఆదిత్య బర్త్‌డే వేడుకలను మంగళవారం టీఎన్జీవో కాలనీలోని తమ ఇంట్లో ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం12 మంది యువకులు, 6 మంది యువతులు పాల్గొన్నారు.
సినీ ఇండస్ట్రీకి చెందినజూనియర్ ఆర్టిస్టులు కూడా..
ఈ బర్త్‌డే పార్టీలో మద్యం, హుక్కాతో పాటు గంజాయి పెద్దఎత్తున వినియోగిస్తున్నారని సమాచారం రావడంతో మాదాపూర్ ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు రైడ్ చేశారు. మొత్తం 40 గ్రాముల డ్రై గంజాయి, మద్యం బాటిళ్లు, హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య, వరుణ్, సాయి ప్రవీణ్‌కు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో వీరిని విచారించి సీఆర్పీ నోటీసు ఇచ్చారు.
మిగిలిన 15 మందిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. పార్టీలో స్వాధీనం చేసుకున్న గంజాయిని వరుణ్ ధూల్‌పేట్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారిలో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ఆర్టిస్టులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.