- నలుగురు అరెస్ట్..నిందితుల్లో ఇద్దరు మైనర్లు
- రూ.35 లక్షల విలువైన 16 బైక్ లు స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు : ఖరీదైన బైక్ లే టార్గెట్ గా చోరీలకు పాల్పడిన నలుగురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.35 లక్షల విలువైన16 బైక్ లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సోమవారం సాయంత్రం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాదాపూర్ జోన్ ఏడీసీపీ జయరాం వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా తణుకుకు చెందిన బైక్ మెకానిక్ దేవకిశోర్(20), అదే జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ వీరవెంకట సత్యనారాయణ(21), స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గా చేసే బాలుడు(17), వైజాగ్ కు చెందిన మరో బాలుడు(17) సిటీకి వచ్చి కొండాపూర్‌లో ఉంటున్నారు.
కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన బాలె దిలీప్(19) వైజాగ్‌లో డిగ్రీ చదువుతున్నాడు. వీరంతా జాబ్ చేస్తుండగా.. వచ్చే శాలరీ సరిపోక ఖరీదైన బైక్ ల చోరీకి ప్లాన్ చేశారు. ఐటీ కారిడార్‌లోని హాస్టల్స్, ఇండ్ల ముందు పార్క్చేసిన బైక్ లను రాత్రి పూట ఎత్తుకెళ్తూ.. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని ఓ గోడౌన్లో దాచేవారు. గచ్చిబౌలిలో 3 , కేపీహెచ్బీలో 3, మాదాపూర్‌లో 4 , మియాపూర్‌లో 1 , ఇతర ప్రాంతాల్లో 5 బైక్ లను చోరీ చేశారు.
ఇలా దొరికారు
చోరీ చేసిన బైక్‌లను ఏపీలో అమ్మేందుకు ఒకేసారి కంటైనర్‌లో తరలించేందుకు రెడీ అయ్యారు. ఆదివారం సాయంత్రం గచ్చిబౌలి పోలీసులు కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా దేవ కిశోర్, వీరవెంకట సత్యనారాయణ నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళ్తూ పోలీసులను చూసి పరార్ అయ్యేందుకు యత్నించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా బైక్ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 2 నెలల్లోనే 16 బైక్ లను చోరీ చేశారు. వీరితో పాటు దిలీప్, ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, డీఐ శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.