రామమ్మకుంటలో ఆక్రమణలు తొలగించారా? లేదా?

రామమ్మకుంటలో ఆక్రమణలు తొలగించారా? లేదా?
  • అఫిడవిట్‌‌‌‌లు దాఖలు చేయాలని ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : గచ్చిబౌలి రామమ్మకుంట చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో ఆక్రమణలు తొలగించారా? లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రామమ్మకుంటలో ఎన్ఐటీహెచ్ఎం చేపట్టిన అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హ్యూమన్‌‌‌‌ రైట్స్‌‌‌‌ అండ్‌‌‌‌ కన్సూమర్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ సెల్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ దాఖలు చేసిన పిల్‌‌‌‌పై సీజే జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాదే, జస్టిస్‌‌‌‌ జె. శ్రీనివాసరావుతో  కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ఆక్రమణలను తొలగించామని లేక్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ కమిటీ తన నివేదికలో పేర్కొనగా, అసలు ఆక్రమణలను తొలగించలేదని పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గడువు ఇస్తే ఆధారాలను సమర్పిస్తామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం అఫిడవిట్‌‌‌‌లు దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తప్పుడు వివరాలు అందించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ నిర్ధారణపై ప్రత్యేకంగా విచారిస్తాం

హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ నిర్ధారణకు సంబంధించిన వివాదంపై ప్రత్యేకంగా విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రామమ్మకుంట ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో జులై 24న హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. హెచ్‌‌‌‌ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని, 230 చెరువులకు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ తుది నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసినట్లు తెలిపారు.

2,525 చెరువులకు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ను గుర్తిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశామని, 3 నెలల్లో తుది నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేస్తామని కోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.