టీఎన్జీవోలో పెత్తనమంతా.. గెజిటెడ్ ఆఫీసర్లదే!

టీఎన్జీవోలో పెత్తనమంతా.. గెజిటెడ్ ఆఫీసర్లదే!
  • ఏడు జిల్లాల్లో అధ్యక్షులుగా వారే..
  • బైలాస్, రోసా రూల్స్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న వైనం
  • గెజిటెడ్ ఆఫీసర్లను తొలగించాలన్న జీఏడీ ఆదేశాలు బేఖాతర్
  • కోర్టుకు వెళ్లే యోచనలో యూనియన్ లీడర్లు

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ నాన్​గెజిటెడ్​ఆఫీసర్స్​అసోసియేషన్​(టీఎన్ జీవో)లో ​గెజిటెడ్​ఆఫీసర్ల పెత్తనం కొనసాగుతోంది. పేరులో ‘ నాన్ గెజిటెడ్​’ ఉన్నప్పటికీ గెజిటెడ్​అధికారులే ఇష్టారాజ్యంగా మారింది. గెజిటెడ్​ఆఫీసర్లుగా ప్రమోషన్​ పొందినవారు టీఎన్​జీవో పదవుల నుంచి తప్పుకోవడమే కాకుండా ప్రాథమిక సభ్యత్వం కూడా వదులుకోవాలి. కానీ, ఓ వైపు గెజిటెడ్​ఆఫీసర్లుగా కొనసాగుతూ.. మరోవైపు నాన్​గెజిటెడ్​అసోసియేషన్​లో గుత్తాధిపత్యం చెలాయించడంపై విమర్శలు వస్తున్నాయి. వారికున్న పలుకుబడితో బైలాస్, రోసా రూల్స్​కు వ్యతిరేకంగా కీలక పదవుల్లో కొనసాగుతూ ఇతరులెవరూ ఎదగకుండా అణివేస్తున్నారని పలువురు టీఎన్​జీవోలు మండిపడుతున్నారు.

యూనియన్​స్టేట్ లీడర్లు, కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సపోర్టుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి అవినీతి, అక్రమాలను ప్రశ్నించే వారిని పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. గెజిటెడ్​ఆఫీసర్లు టీఎన్​జీవో నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్​చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కోర్టులోనే తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 

ఏడు జిల్లాల్లో అధ్యక్షులుగా వారే... 

టీఎన్​జీవో అసోసియేషన్​ఎన్నికలు మూడేండ్లకోసారి జరుగుతాయి. అసలు.. ఈ ఎన్నికల తీరుపైనే అనేక విమర్శలున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు చెందిన గెజిటెడ్​ఆఫీసర్లు యూనియన్​ను తమ గుప్పిట్లో పెట్టుకొని ఏకపక్షంగా ఏకగ్రీవాల పేరుతో ఎన్నికై జిల్లా కమిటీల్లో పాతుకుపోతున్నారు. ఇలా ఏడు జిల్లాల్లో అధ్యక్షులుగా కొనసాగుతుండగా, మరికొందరు వివిధ పదవుల్లో తిష్టవేశారు.

ప్రస్తుతం మంచిర్యాల, జగిత్యాల, మహబూబ్​నగర్​, వనపర్తి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు గెజిటెడ్​ఆఫీసర్లు అధ్యక్షులుగా ఉన్నారు. నిజామాబాద్​జిల్లా టీఎన్​జీవో అధ్యక్షుడిగా ఉన్న గెజిటెడ్​ అధికారిపై విమర్శలు రావడంతో ఇటీవల పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త కమిటీ ఎన్నికయ్యేంత వరకు ఈ పదవిలో కొనసాగాలని రాష్ట్ర నాయకత్వం సూచించినట్టు తెలిసింది. 

మంచిర్యాల జిల్లా కమిటీలో నలుగురు 

మంచిర్యాల జిల్లా టీఎన్​జీవో కార్యవర్గంలో నలుగురు గెజిటెడ్​ఆఫీసర్లు కీలకమైన పదవుల్లో ఉన్నారు. అధ్యక్షుడు గడియారం శ్రీహరి (డిప్యూటీ తహసీల్దార్​), అసోసియేట్​ప్రెసిడెంట్​శ్రీపతి బాపురావు (మండల పంచాయతీ అధికారి), వైస్​ప్రెసిడెంట్​ కూర్మాచలం శ్రీనివాస్​(డిప్యూటీ తహసీల్దార్​), స్టేట్​ సెక్రటరీ పొన్న మల్లయ్య (ఫారెస్ట్​ ఆఫీసు ఏవో) గెజిటెడ్​ఆఫీసర్లుగా ప్రమోషన్​పొందినప్పటికీ టీఎన్​జీవోను వదిలిపోవడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటే యూనియన్​లో వారి పలుకుడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు జరిగి ఇప్పటికి ఏడు నెలలు గడువగా, మరో రెండున్నరేండ్లు పదవుల్లో కొనసాగనున్నారు.

బైలాస్​, రోసా రూల్స్​కు వ్యతిరేకం 

వాస్తవానికి టీఎన్​జీవోలో గెజిటెడ్​అధికారులకు స్థానం లేదు. వారికి తెలంగాణ గెజిటెడ్​ఆఫీసర్స్​ (టీజీవో) పేరిట వేరే యూనియన్​ఉంది. గెజిటెడ్​ఆఫీసర్లుగా ప్రమోషన్​పొందినవారు వెంటనే పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేయాలి. బైలాస్, రోసా రూల్స్​కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఫస్ట్​ లెవల్​గెజిటెడ్​ఆఫీసర్​అని కొత్త పేరు పెట్టి టీఎన్​జీవోలో కొనసాగే విధంగా గత ప్రభుత్వంలో సడలింపు తెచ్చుకున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని టీఎన్​జీవోలో కీలక పదవులు చేపట్టి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీనిపై చాలారోజుల నుంచి యూనియన్​లో వివాదాలు నడుస్తున్నాయి. 

జీడీఏ ఆదేశాలూ బేఖాతర్​ 

టీఎన్​జీవోలో గెజిటెడ్​ఆఫీసర్ల వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో సీనియర్​ అసిస్టెంట్​బట్టు రాఘవేందర్​జనరల్​అడ్మినిస్ర్టేషన్​(సర్వీసెస్​) డిపార్ట్​మెంట్​కు ఫిర్యాదు చేశారు. సెక్షన్​80 ఆఫ్​ సీపీసీ కింద ఈ ఏడాది జూలై 6న అడ్వకేట్​ద్వారా లీగల్​నోటీస్​ ఇచ్చారు. దీనిపై స్పందించిన జీఏడీ ప్రిన్సిపల్​ సెక్రటరీ యూనియన్​బైలాస్​, రోసా రూల్స్​ప్రకారం నడుచుకోవాలని టీఎన్​జీవో కేంద్ర కమిటీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్​కు జూలై 24న నోటీసు​జారీ చేశారు.

గెజిటెడ్​ఆఫీసర్లుగా ప్రమోషన్​ పొంది టీఎన్​జీవో పదవుల్లో కొనసాగుతున్న వారిని వెంటనే తొలగించి ప్రభుత్వానికి రిపోర్ట్​ సమర్పించాలని కోరారు. ఇప్పటికి రెండున్నర నెలలు కావస్తున్నా టీఎన్​జీవో కేంద్ర కమిటీ స్పందించలేదంటున్నారు. జీఏడీ ఆదేశాలను సైతం బేఖాతర్​ చేయడంపై పలువురు విమర్శిస్తున్నారు. హౌసింగ్​ సొసైటీల లావాదేవీలతో పాటు ఇతర వ్యవహారాల కారణంగానే వీరు టీఎన్​జీవోను అంటిపెట్టుకుని ఉంటున్నారని ఆరోపిస్తున్నారు.