హైదరాబాద్, వెలుగు: 317, 46 జీవోలతో నష్టపోయిన ఉద్యోగుల అప్లికేషన్ స్టేటస్ వివరాలు ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల కల్లా అందజేయాలని అన్ని శాఖలను జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా ఆదేశించారు. స్థానికత, భార్యాభర్తలు, మ్యూచువల్ , డబుల్ అప్లికేషన్లు, అప్లికేషన్లలో ఎవరి సమస్య ఏంటి, వాటికి పరిష్కారం, వీరికి స్థానికత ప్రకారం సొంత జిల్లాలకు పంపాలంటే ఉన్న లాభ నష్టాలు, పోస్టింగ్ ఇవ్వాలంటే ఎన్ని సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలన్న వివరాలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వీటిని go317and46issues.telangana.gov.in పోర్టల్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ జీవోల సవరణపై మంత్రి దామోదర చైర్మన్గా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబులు మెంబర్లుగా పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. స్థానికత ఆధారంగా నష్టపోయిన ఉద్యోగులకు పోస్టింగ్ ఇచ్చే అంశంపై అడ్వకేట్ జనరల్ నుంచి లీగల్ ఓపీనియన్ తీసుకోవాలని ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈనెలాఖరుకు జీవో సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.