తుంగతుర్తి, వెలుగు: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఆయన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు 55 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో చేసి చూపించారన్నారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారన్నారు.
కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం నూతనకల్, మద్దిరాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా, తుంగతుర్తి మండల కేంద్రంలో 9 మండలాల దళిత నాయకులు సమావేశమై గాదరి కిశోర్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.