ఎన్‌కౌంటర్‌‌లో మావో అగ్రనేత మిలింద్ తెల్టుంబే మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన  26 మంది మావోయిస్టుల  మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 16 మంది మావోయిస్టులను గుర్తించారు పోలీసులు. మరో 10 మందిని  గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఒకరు సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నారు. DVCM స్థాయి వ్యక్తులు ఇద్దరు, కమాండర్ స్థాయి వ్యక్తులు ఇద్దరు, ఏసీఎం స్థాయి వ్యక్తులు ఒక్కరు, పీపీసీఎం స్థాయి వ్యక్తులు నలుగురు, పీఎం స్థాయి వ్యక్తులు నలుగురు ఉన్నారు. ఏ హోదా తెలియని వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. చనిపోయిన మిలింద్ తెల్టుంబేపై 50 లక్షల రివార్డ్ ఉందన్నారు పోలీసులు. లోకేశ్ మంగుపై 20 లక్షలు, మహేశ్ శివాజీపై 16 లక్షలు, కొర్చి దలం కమాండర్ కిషన్ పై 8 లక్షలు, సన్ను కొవాచీపై 8 లక్షలు, భగత్ సింగ్ పై 6 లక్షలు రివార్డ్ ఉందని చెప్పారు. 

నిన్న మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో సీ–60 పోలీస్ కమాండో టీమ్ తోపాటు స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు. గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలోకి అడిషనల్ ఎస్పీ సౌమ్యా ముండే ఆధ్వర్యంలో సీ-60 బలగాలు వెళ్లాయి. మూడు వైపుల నుంచి మావోయిస్టులు బస చేసిన ప్రాంతానికి చేరుకున్నాయి. శిబిరాలు నిర్మించుకుని, సమావేశ ఏర్పాట్లలో ఉన్న మావోయిస్టులు.. భద్రతాబలగాలు తమను చుట్టుముట్టడాన్ని గమనించారు. వెంటనే తేరుకుని ఫైరింగ్ ప్రారంభించారు. దీంతో అడవి కాల్పుల మోతతో దద్దరిల్లింది. 4 గంటల పాటు ఏకధాటిగా కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ లో దాదాపు 26 మంది చనిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో నలుగురు సీ-60 టీమ్ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు...

ఎన్‍కౌంటర్ తర్వాత మిగిలిన నక్సల్స్ పారిపోయారు. దీంతో వారి కోసం అదనపు బలగాలను పోలీసులు అడవిలోకి పంపించారు. మహారాష్ట్ర, చత్తీస్‍గఢ్‍, తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రెడ్‍అలర్ట్ ప్రకటించారు. పారిపోయిన నక్సల్స్ ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లోకి వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పాయి. ప్రతీకార దాడులకు కూడా పాల్పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించాయి. మే 21న గడ్చిరోలి జిల్లాలోనే ఏటపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, సీ60 బలగాల మధ్య ఎన్‍కౌంటర్ జరిగింది. అప్పుడు 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తర్వాత ఇదే పెద్ద సంఘటన.

ఎన్‍కౌంటర్‍ జరిగిన ప్రదేశం దట్టమైన దండకారణ్యం కావడం, 26 మంది మావోయిస్టులు చనిపోవడంతో.. రికవరీ చేసిన ఆయుధాలు, మృతదేహాల తరలింపు భద్రతా బలగాలకు సవాలుగా మారింది. ఒకవైపు డెడ్  బాడీలు, ఆయుధాలను తరలిస్తూనే మరోవైపు మావోయిస్టుల నుంచి తమను తాము కాపాడుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. మావోయిస్టులు, వారి సానుభూతిపరులు, మిలీషియా సభ్యులకు పట్టున్న ప్రాంతం కావడంతో.. సాయంగా వెళ్లిన అదనపు బలగాలు మిగతా వారికి రక్షణ కల్పిస్తున్నాయి.

గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఇంకా జరుగుతోంది. ఎన్ కౌంటర్ జరిగిన స్థలం నుంచి 29 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో AK-47 రైఫిళ్లు-5, SLR తుపాకులు-9, ట్వెల్ బోర్ తుపాకులు-9, ఇన్సాస్ రైఫిల్-1, 303 తుపాకులు-3
 ఒక పిస్తోల్ ఉన్నాయి.