- బీఆర్ఎస్ హైకమాండ్‌కు గడ్డం అరవింద్ రెడ్డి వార్నింగ్
- తనకు లేదా బీసీకి ఇచ్చినా గెలిపించుకుంటామని వెల్లడి
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థిని మార్చాలని.. లేదంటే బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ఆ పార్టీ హైకమాండ్‌కు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లో అభ్యర్థిని మార్చని పక్షంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు కేటాయించడంపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఆదివారం మంచిర్యాలలోని తన నివాసంలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా బీఆర్ఎస్ బలోపేతానికి శ్రమించిన అరవింద్‌రెడ్డికి కేసీఆర్ అన్యాయం చేశారని ఆయన సపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అరవింద్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేదంటే ఆయనను ఇండిపెండెంట్‌గా బరిలో నిలిపి గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ.. దివాకర్ రావు హయాంలో నియోజకవర్గం పదేండ్లు వెనక్కు పోయిందన్నారు. మిషన్ భగీరథ బట్టలు ఉతకడానికి కూడా పనికి రావడం లేదన్నారు. మంచిర్యాలలో శ్మశానవాటిక లేదని, డంపింగ్ యార్డు నిర్మించలేదని అన్నారు.
మరోసారి దివాకర్‌రావును గెలిపిస్తే నియోజకవర్గం మరో ఐదేండ్లు వెనుకబడుతుందని పేర్కొన్నారు. మూడు పార్టీలకు వెలమ దొరలు తప్ప నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. బీసీకి టికెట్ ఇస్తే బంపర్ మెజారిటీతో గెలిస్తామన్నారు. ఈ విషయమై త్వరలోనే ఉద్యమకారులతో కలిసి మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను కలుస్తామన్నారు. వారం రోజుల్లో అభ్యర్థిని మార్చకపోతే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. సమ్మేళనంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, ముత్తినేని రవి మాట్లాడారు.