![అసైన్డ్ భూములను గుంజుకునేందుకే ధరణిని తెచ్చారు](https://static.v6velugu.com/uploads/2022/11/Gaddam-Prasad-Kumar_UVTnwDGyi3.jpg)
వికారాబాద్, వెలుగు: వికారాబాద్అనంతగిరి గడ్డ నుంచే ‘ధరణి పోర్టల్’పై దండయాత్ర మొదలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను గుంజుకునేందుకే ధరణిని తెచ్చారని ఆరోపించారు. బుధవారం ఆయన వికారాబాద్‌లో ధరణి పోర్టల్సమస్యలపై నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. నవాబ్ పేట మండలం ఆర్కతల గ్రామంలో 800 ఎకరాలు అసైన్డ్ భూమిని కేటీఆర్ బంధువల పేరున కొన్నారని చెప్పారు. మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామంలో మరో 800 ఎకరాల అసైన్డ్ భూమికి అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు.
కరీంపూర్లోని 63 మంది రైతులకు చెందిన145 ఎకరాలు ధరణి రికార్డుల్లో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను సీఎం కేసీఆర్ధరణిని అడ్డుపెట్టుకొని జిల్లా కలెక్టర్‌తో చీకటి రికార్డులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మర్పల్లి మండలం పట్లూరులో 37 ఎకరాలు, గుండ్లమర్పల్లి శివారులో 32 ఎకరాల భూములకు అక్టోబర్1న పాస్ పుస్తకాలు జారీ చేయడమే ఇందుకు సాక్ష్యం అన్నారు. ప్రసాద్ కుమార్ ప్రారంభించిన దీక్షను అన్ని జిల్లాల్లో చేపడతామని అద్దంకి దయాకర్ తెలిపారు. కేసీఆర్ ఇప్పటికే 2లక్షల ఎకరాలు దోచుకున్నాడని ఆరోపించారు. త్వరలో ముందస్తు ప్రకటన లేకుండా కలెక్టరేట్లను ముట్టడిస్తామని వెల్లడించారు. జిల్లా రైతు నాయకులు రత్నారెడ్డి, సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, ధరణి బాధితులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.