
వికారాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే సోషల్ మీడియా పాత్ర ముఖ్యమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. మంగళవారం వికారాబాద్‌లోని తన ఇంట్లో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి, పార్టీ నాయకులతో ప్రసాద్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఏదైనా సమాచారం క్షణాల్లో జనాల్లోకి వెళ్లాలంటే కేవలం సోషల్ మీడియా ద్వారానే సాధ్యమన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిసేలా చేసే బాధ్యతను ప్రతి ఒక్క సోషల్ మీడియా కోఆర్డినేటర్ తీసుకోవాలన్నారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం కోట్‌పల్లి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్, కౌన్సిలర్ మురళి, నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.